Edible oil prices: వంట నూనెలపై భారీ ఊరట.. ధరలు తగ్గించిన అదానీ విల్మర్‌

Adani Wilmar cuts prices of edible oils: అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో వంట నూనెల ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 18 Jul 2022 14:48 IST

దిల్లీ: ఫార్చూన్‌ బ్రాండ్‌పై వంట నూనెలు (Edible oils) విక్రయించే అదానీ విల్మర్‌ కంపెనీ (Adani Wilmar) వినియోగదారులకు అధిక ధరల నుంచి ఊరట కల్పించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో వంట నూనెల ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సోయాబీన్‌ ఆయిల్‌ ధరలు భారీగా దిగి వచ్చాయి. త్వరలో తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నాయి.

అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని ఇటీవల కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గిస్తున్నట్లు అదానీ విల్మర్‌ కంపెనీ ప్రకటించింది. త్వరలోనే తగ్గించిన ధరలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఎండీ, సీఈఓ అంగ్షు మల్లిక్‌ పేర్కొన్నారు. రాబోయే పండగల సీజన్‌లో డిమాండ్‌ పెరుగుదలకు ఈ ధరల తగ్గింపు ఊతమిస్తుందని పేర్కొన్నారు. అదానీ విల్మర్‌ బ్రాండ్‌ పేరిట వంట నూనెలతో పాటు బియ్యం, గోధుమ పిండి, చక్కెర, శనగ పిండి వంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

దేనిపై ఎంతెంత?

  • ఫార్చూన్‌ సోయాబీన్‌ ఆయిల్‌ లీటర్‌ ఎమ్మార్పీ ₹195 నుంచి ₹165కి తగ్గింపు
  • ఫార్చూన్‌ సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ₹210 నుంచి ₹199కి తగ్గింపు
  • ఆవ నూనె గరిష్ఠ ధర ₹195 నుంచి ₹190కి తగ్గింపు
  • రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ₹225 నుంచి ₹210కి తగ్గింపు
  • వేరు శనగ నూనె ₹220 నుంచి ₹210కి తగ్గింపు
  • రాగ్‌ బ్రాండ్‌పై విక్రయించే వనస్పతి ₹200 నుంచి ₹185కి తగ్గింపు
  • రాగ్‌ పామోలిన్‌ ₹170 నుంచి ₹144కి తగ్గింపు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని