FDIల ఆకర్షణలో గుజరాత్‌ ముందంజ!

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలంలో 81.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎఫ్‌డీఐల రూపంలో భారత్‌కు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు దేశంలోకి వచ్చిన....

Published : 28 May 2021 22:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలంలో 81.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎఫ్‌డీఐల రూపంలో భారత్‌కు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలలో ఇదే అత్యధికం. వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధి నమోదైంది.

భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలలో అత్యధికంగా 37 శాతం పెట్టుబడులు గుజరాత్‌కు వెళ్లాయి. మహారాష్ట్ర(27 శాతం), కర్ణాటక(13 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో గుజరాత్‌ తొలి స్థానంలో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.30.23 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చేరాయి. ఇక ఆ రాష్ట్రానికి చేరిన ఎఫ్‌డీఐలలో 94 శాతం కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ రంగాలకు సంబంధించినవే. భారత్‌లో ఈ రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలలో 78 శాతం గుజరాత్‌కే చేరడం గమనార్హం.

ఇక ఎఫ్‌డీఐలను ఆకర్షించిన రాష్ట్రాల జాబితాలో దిల్లీ నాలుగో స్థానంలో, తమిళనాడు, ఝార్ఖండ్‌, హరియాణా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, యూపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలోకి రూ.11,332 కోట్లు ఎఫ్‌డీఐల రూపంలో వచ్చాయి. సింగపూర్ 29 శాతం ఎఫ్‌డీఐలతో ఇండియాలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన దేశంగా నిలిచింది. తరువాతి స్థానాల్లో అమెరికా (23 శాతం), మారిషస్ (9 శాతం) ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతులు, కంప్యూటర్ సాఫ్ట్‌‌వేర్, హార్డ్‌‌వేర్, రబ్బరు వస్తువులు, రిటైల్ ట్రేడింగ్, డ్రగ్స్ , ఫార్మాస్యూటికల్స్, రంగాల్లోకి వచ్చిన ఎఫ్​డీఐలు 100 శాతానికి పైగా పెరగడం విశేషం. తాజా వివరాల ప్రకారం 2020లో ప్రపంచ ఎఫ్‌‌డీఐ మార్కెట్​  కుదేలైంది.  2019లో 1.5 ట్రిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలు నమోదు కాగా, 2020లో ఇవి 42 శాతం తగ్గి 859 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని