Investment: మార్కెట్‌ ఒడుదొడుకుల్లో మేలైన పెట్టుబడి ప్రత్యామ్నాయాలు!

రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.....

Updated : 04 Mar 2022 12:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు చమురు ధరలు సైతం భారీగా పెరిగి ద్రవ్యోల్బణ భయాల్ని సృష్టిస్తున్నాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల కారణంగా సరఫరా వ్యవస్థకూ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో కొద్దికాలం మార్కెట్‌లో హెచ్చుతగ్గులు తప్పని పరిస్థితి ఏర్పడింది.

వడ్డీరేట్లు పెరిగే అవకాశం..

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్న అంశం. దీంతో దాదాపు అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. భారత్‌ సహా మరికొన్ని వర్దమాన దేశాలు ఆ దిశగా సంకేతాలు ఇచ్చాయి. మరోవైపు తాజా ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణ భయాల్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు దాదాపు అనివార్యంగా మారింది. మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న ఈ తరుణంలో స్వల్పకాలం కోసం అందుబాటులో ఉన్న కొన్ని స్థిరాదాయ మదుపు మార్గాలేంటో పరిశీలిద్దాం..!

వయసు, కాలపరిమితి ఓకే అయితే..

స్థిర ఆదాయ మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఒకటి. కరోనా సంక్షోభంలో భారీగా తగ్గిన వడ్డీరేట్లు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. స్వల్పకాలం కోసం, సీనియర్‌ సిటిజన్లకయితే.. బ్యాంకులు అందించే సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన పెట్టుబడి మార్గం.

కార్పొరేట్‌ డిపాజిట్లనూ పరిశీలించండి..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన రాబడి కావాలనుకుంటే.. కార్పొరేట్‌ డిపాజిట్లు మేలు. ఐదేళ్ల కంటే తక్కువ కాలపరిమితి కోసం మదుపు చేస్తున్నట్లయితే ఇదే సరైన మదుపు మార్గం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్ వంటి బ్లూచిప్‌ కంపెనీలు ఐదేళ్ల కాలానికి 5.65-6.8 శాతం వడ్డీరేటును అందిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగమ్‌’ 5.75-6.5 శాతం వడ్డీరేటును అందిస్తున్నాయి.

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో ఎఫ్‌డీలు..

కస్టమర్లను ఆకర్షించడం కోసం స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మెరుగైన వడ్డీరేట్లను అందిస్తున్నాయి. బిజినెస్‌ విస్తరణలో కొంచెం దూకుడుగా వ్యవహరించే ఈ బ్యాంకులు 6.75 శాతం వరకు వడ్డీరేటును ఇస్తున్నాయి. పైగా రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై ప్రభుత్వం బీమా ఇవ్వనున్న నేపథ్యంలో వీటిలో మదుపు కొంతవరకు సురక్షితమనే చెప్పాలి. ఒకవేళ బ్యాంకులు దివాలా తీసినా మన సొమ్ము మనకు తిరిగొచ్చేస్తుంది.

ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేటు బాండ్లు..

దాదాపు 7.15 శాతం వరకు వడ్డీరేటు ఇచ్చే ఫ్లోటింగ్‌ రేటు బాండ్లు మరో మేలైన మదుపు మార్గం. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC)తో పోలిస్తే ఫ్లోటింగ్‌ రేటు బాండ్లలో 35 బేసిస్‌ పాయింట్లు అధిక వడ్డీరేటును ఆఫర్‌ చేస్తాయి. సాధారణ వడ్డీరేట్లు పెరిగే కొద్దీ ఈ బాండ్ల రేట్లు సైతం ఎగబాకుతూ వెళతాయి.

స్మాల్‌ సేవింగ్స్‌ సాధనాలు..

వీటిలో వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, వీటి విషయంలో కొన్ని అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌ వంటి మదుపు మార్గాల్లో లాకిన్ పీరియడ్‌ ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు మీ మదుపుపై రాబడి వస్తున్నప్పటికీ.. నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీ పెట్టుబడి లక్ష్యాలకు ఇవి సరిపోతాయనుకుంటే ముందుకు వెళ్లొచ్చు. మరోవైపు సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీం (SCSS‌), సుకన్య సమృద్ధి యోజన (SSY) కొన్ని వర్గాలకు మాత్రమే సరిపోతాయి. మదుపు మొత్తంపైనా పరిమితి ఉంటుంది.

పీఎం వయ వందన యోజన..

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ అందిస్తున్న ఈ పథకం ఎస్‌సీఎస్‌ఎస్‌ తరహాలోనే రాబడినిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు ఇది సరైన పెట్టుబడి మార్గం.

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్..

రెండేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న ఫండ్లను పక్కన పెడితే ఇవి కూడా మంచి పెట్టుబడి మార్గం. బ్యాంకింగ్‌, పీఎస్‌యూ ఫండ్లు మంచి రాబడినిస్తాయి. టార్గెట్‌ మ్యూచువల్‌ ఫండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని