₹2000 నోట్లున్నాయా? Amazonలో మార్చుకోవచ్చు!

మీ దగ్గర రూ.2వేల నోట్లుంటే అమెజాన్‌లో మార్చుకోవచ్చు. ఆ మొత్తాన్ని అమెజాన్‌ పే అకౌంట్‌లో జమ అవుతాయి. డోర్‌ స్టెప్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని అమెజాన్‌ అందిస్తోంది. 

Published : 21 Jun 2023 20:45 IST

దిల్లీ: మీ దగ్గర రూ.2వేల నోట్లున్నాయా? (Rs 2,000 notes) ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత బయట ఎవరూ నోట్లను స్వీకరించడం లేదా? బ్యాంకుకు వెళ్లే తీరిక దొరకడం లేదా? అయితే మీకు అమెజాన్‌ (Amazon) అకౌంట్‌ ఉంటే మీరు సులువుగా మీ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవచ్చు. పైగా ఇంటి దగ్గరే మీరు ఆ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. నోట్ల మార్పిడి కోసం అమెజాన్‌ ఈ సౌకర్యం కల్పిస్తోంది. ఈ మొత్తం అమెజాన్‌ పే బ్యాలెన్స్‌లో క్రెడిట్‌ అవుతుంది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్ల సమయంలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

మే 19న రూ.2వేల నోటును ఉపసంహరించుకున్నట్లు నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో నోట్లు మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. ఆ గడువు వరకు ఈ నోట్లను వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా.. బయట ఎవరూ స్వీకరించడం లేదు. ఈ నేపథ్యంలో క్యాష్‌ లోడ్‌ ఎట్‌ డోర్‌స్టెప్‌ సర్వీసులను అమెజాన్‌ తీసుకొచ్చింది. ఏదైనా వస్తువు క్యాష్‌ ఆన్‌ డెలివరీపై కొనుగోలు చేసినప్పుడు రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు. ఆర్డర్‌ విలువ మినహాయించుకుని.. మీరిచ్చిన అమౌంట్‌ను అమెజాన్‌ పే బ్యాలెన్స్‌లో డెలివరీ ఏజెంట్‌ లోడ్‌ చేస్తారు.

కేవైసీ (KYC) పూర్తి చేసుకున్న కస్టమర్లు డోర్‌ స్టెప్‌ సేవలను వినియోగించుకోవచ్చు. నెలలో గరిష్ఠంగా రూ.50వేల వరకు ఇలా డిపాజిట్‌ చేసుకునే సదుపాయాన్ని అమెజాన్‌ కల్పిస్తోంది. ఒకవేళ కేవైసీ పూర్తి చేయని వారు అమెజాన్‌ యాప్‌లో వీడియో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు 5-10 నిమిషాలు పడుతుంది. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌లో ఆ మొత్తాన్ని ఎవరికైనా యూపీఐ ద్వారా పంపించుకోవచ్చు. లేదంటే ఫోన్‌ నంబర్‌/ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు చేయొచ్చని అమెజాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని