Amazon: భారత ప్రకృతి ఆధారిత ప్రాజెక్టుల్లో అమెజాన్‌ 3 మి.డాలర్ల పెట్టుబడులు

Amazon: 2019లో అమెజాన్‌ (Amazon) ‘రైట్‌ నౌ క్లైమేట్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేసింది. దీనికోసం 100 మిలియన్‌ డాలర్లు కేటాయించింది. వీటి నుంచి 3 మిలియన్‌ డాలర్లు భారత్‌లో వెచ్చించనున్నట్లు తాజాగా ప్రకటించింది.

Updated : 04 Sep 2023 15:30 IST

దిల్లీ: భారత్‌లో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టుల్లో ప్రాథమికంగా మూడు మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) సోమవారం ప్రకటించింది. ఆసియా- పసిఫిక్‌ ప్రాంతంలో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టులకు కేటాయించిన 15 మిలియన్‌ డాలర్ల నుంచి వీటిని వెచ్చించనున్నట్లు తెలిపింది.

తొలి ప్రాజెక్టులో భాగంగా పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్య సంరక్షణకు కృషి చేస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ స్టడీస్‌ (CWS)’తో కలిసి పనిచేయనున్నట్లు అమెజాన్‌ (Amazon) వెల్లడించింది. భారత వన్యప్రాణ జాతుల్లో 30 శాతం పశ్చిమ కనుమల్లోనే ఉన్నట్లు పేర్కొంది. ఆసియా పులులు, ఏనుగుల్లో అత్యధికంగా ఈ ప్రాంతంలోనే ఉంటున్నట్లు గుర్తుచేసింది. అలాగే ‘వైల్డ్‌ కార్బన్‌’ కార్యక్రమం కోసం సీడబ్ల్యూఎస్‌కు 1 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా పళ్లు, కలపతో పాటు ఔషధ గుణాలున్న చెట్లను నాటి, సంరక్షించేలా రైతులకు సాయం అందించనున్నట్లు వివరించింది. ఆసియా- పసిఫిక్‌ ప్రాంతం భారీ అడవులు, విలువైన కోస్తా తీరాలకు నెలవని పేర్కొంది. కానీ, ఈ ప్రాంతం పర్యావరణ మార్పులు, జీవజాతులు అంతరించిపోవడం, నేల సారం కోల్పోవడం వంటి దుష్ప్రభావాలకు అధికంగా లోనవుతోందని తెలిపింది. వీటన్నిటి నుంచి ఈ ప్రాంతాన్ని సంరక్షించడం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అలాగే క్షేత్రస్థాయి ప్రణాళికలు సైతం అవసరమని తెలిపింది. ఈ రెండు స్థాయుల్లో అమెజాన్‌ పెట్టుబడులు పెడుతుందని పేర్కొంది.

2019లో అమెజాన్‌ (Amazon) ‘రైట్‌ నౌ క్లైమేట్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేసింది. ప్రకృతి సంరక్షణ, దీనికి సంబంధించిన ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం 100 మిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించింది. ఆసియా- పసిఫిక్‌ ప్రాంతం కోసం 15 మిలియన్‌ డాలర్లను ఈ ఫండ్‌ నుంచే కేటాయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని