ATF price: విమాన సంస్థలకు ఊరట.. తగ్గిన ఏటీఎఫ్‌ ధర.. పెట్రోల్‌, డీజిల్‌ మాటేంటి?

ATF price: విమానాల్లో ఇంధనంగా వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATF) ధర కాస్త తగ్గుముఖం పట్టింది. 

Published : 16 Jul 2022 13:28 IST

దిల్లీ: విమానాల్లో ఇంధనంగా వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATF) ధర కాస్త తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఏటీఎఫ్‌ ధరను2.2 శాతం మేర తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు శనివారం ప్రకటించాయి. దీంతో ఏటీఎఫ్‌ ధర కిలో లీటర్‌కు ₹3,084.94 మేర తగ్గి ₹138,147.93కి చేరింది. అంతకుముందు ఈ ధర ₹ 141,232.87గా (లీటర్‌ ₹141.23) ఉంది.

ఏటీఎఫ్‌ ధరను ప్రతి నెలా ఒకటో, 16వ తేదీన సమీక్షిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా వీటిధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆయిల్‌ కంపెనీలు ఏటీఎఫ్‌ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతకుముందు జూన్‌ 16న ఏటీఎఫ్‌ ధరను ఏకంగా 16 శాతం మేర చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఈ ఏడాదిలో 11 సార్లు వీటి ధరలను పెంచారు. దీంతో గడిచిన ఆరు నెలల్లో వీటి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే వీటి ధరలు తగ్గించారు. చివరి సారిగా జూన్‌ 1న ఏటీఎఫ్‌ ధరలను 1.3 శాతం మేర తగ్గించగా.. తాజాగా మరో 2.2 శాతం తగ్గించారు.

విమాన కార్యకలాపాల్లో 40 శాతం ఖర్చు ఇంధనానికే అవుతుంది. ఇటీవల కాలంలో ఏటీఎఫ్‌ ధరలు అమాంతం పెరగడంతో విమానయాన సంస్థలు ధరలు పెంచేందుకు యోచిస్తున్నాయి. కొవిడ్‌ కాలంలో విమాన టికెట్‌ ధరలపై విధించిన పరిమితిని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపు వాటికి కాస్త ఊరటనివ్వనుంది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మత్రం ఎలాంటి మార్పూ లేదు. మే 22న పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన తర్వాత వీటి ధరల్లో ఎలాంటి మార్పూ లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని