ATF price: విమాన ఇంధనం ధర.. కిలో లీటర్‌పై రూ.2,258 పెంపు

దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. అటు విమాన ఇంధన(ఏటీఎఫ్‌) ధరపైనా

Published : 01 Apr 2022 10:48 IST

ఈ ఏడాదిలో ఏడోసారి పెంపు..

దిల్లీ: దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. అటు విమాన ఇంధన(ఏటీఎఫ్‌) ధరపైనా చమురు సంస్థలు భారీగానే వడ్డిస్తున్నాయి. దిల్లీలో ఏటీఎఫ్‌ ధర కిలో లీటర్‌పై రూ.2,258.54 (2శాతం) పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కిలో లీటరు విమాన ఇంధన ధర రూ.1,12,924.83 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠానికి చేరింది.

ఈ ఏడాదిలో ఏటీఎఫ్‌ ధర పెరగడం వరుసగా ఇది ఏడోసారి కావడం గమనార్హం. అంతకుముందు మార్చి 16న కిలోలీటర్‌ ఏటీఎఫ్‌పై ఏకంగా 18.3శాతం పెంచారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగా ఏటీఎఫ్‌ ధరను ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరిస్తుంటారు. 2022 జనవరి 1 నుంచి ప్రతి 15 రోజులకు వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏటీఎఫ్‌ ధర రూ.38,902.92 (50శాతానికి పైగా) పెరిగింది. విమాన నిర్వహణలో దాదాపు 40 శాతం వాటా వ్యయం ఇంధనానిదే. దీంతో రాబోయే రోజుల్లో విమాన ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశముంది.

మరోవైపు గత 10 రోజులుగా వరుసగా పెరుగుతున్న చమురు ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో నేడు చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఇదే సమయంలో వాణిజ్య సిలిండర్‌పైనా భారీగా వడ్డించారు. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.250కి పైగా పెంచారు. దీంతో హోటల్‌, రెస్టారంట్ల నిర్వహకులపై అదనపు భారం పడనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని