సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ తో అనేక ప్రయోజనాలు..

ఖాతా పొడిగింపు కోసం మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందే మీ అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది

Updated : 23 Apr 2022 16:46 IST

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌) అనేది 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఎలాంటి నష్ట భయం లేకుండా ఆదాయాన్ని అందించడం కోసం ప్రారంభించిన ఒక చిన్న పొదుపు పధకం. 60 సంవత్సరాల వయస్సు దాటని వారు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఈ ఖాతాను తెరవవచ్చు. రక్షణ సర్వీసుల నుంచి పదవీ విరమణ చేసిన వారు 50 సంవత్సరాల వయస్సు నుంచి పెట్టుబడి పెట్టడానికి అర్హులు. కానీ, పౌర రక్షణ ఉద్యోగులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. 

సాధారణంగా ఎస్‌సీఎస్‌ఎస్‌ మెచ్యూరిటీ సమయం అయిదు సంవత్సరాలు. అయితే, దీనిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఖాతా పొడిగింపు కోసం మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందే మీ అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాతాను అన్ని పోస్టాఫీసులతో పాటు, నియమించిన కొన్ని బ్యాంకు శాఖలలో మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో త్రైమాసికానికి ఒకసారి అనగా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల్లోని మొదటి పని దినాన వడ్డీ చెల్లింపులు చేస్తారు. 

ఒక డిపాజిట్ దారుడు ఈ స్కీమ్ లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహించవచ్చు, అయితే అన్ని ఖాతాలలో బ్యాలెన్స్ ను ఒకే ఖాతాలోకి జోడించి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ ఖాతాలను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి ఖాతా ద్వారా కూడా తెరవచ్చు, కానీ ఉమ్మడి ఖాతాను కేవలం భార్య పేరుతో మాత్రమే అనుమతిస్తారు. ఉమ్మడి ఖాతా విషయంలో, మొదటి దరఖాస్తుదారుడి వయస్సును అర్హతగా పరిగణిస్తారు. రెండవ దరఖాస్తుదారుని వయస్సుకు పరిమితి లేదు. ఈ ఖాతాలోని మొత్తం పెట్టుబడులు మొదటి దరఖాస్తుదారునికే చెందుతాయి. 

జీవిత భాగస్వాములు ఇద్దరూ వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి ఖాతాలలో ఒక్కొక్కరూ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు, ఈ పథక నియమ నిబంధనల ప్రకారం, ఇద్దరూ వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టడానికి అర్హతను కలిగి ఉంటారు. ప్రస్తుతం, ఎస్‌సీఎస్‌ఎస్‌ తమ ఖాతాదారులకు సంవత్సరానికి 7.40 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ పథకంతో సహా అన్ని రకాల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సవరిస్తూ ఉంటారు. 

ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివర్లో మీ పదవీ విరమణ ఉన్నట్లయితే, మీరు రెండు భాగాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. మొదటి భాగాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిగా పెట్టి, రెండవ భాగాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీరు సెక్షన్ 80సీ కింద రెండు సంవత్సరాలు పన్ను ప్రయోజనాలను పొందుతారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఎస్‌సీఎస్‌ఎస్‌ లో సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.  

ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకం ప్రస్తుతం అందించే 7.40 శాతం వడ్డీ రేటు, చాలా బ్యాంకులు తమ పొదుపు ఖాతాలకు అందించే వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే, దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదం ఉండదు. 

ఈ పథకంలో ముందస్తు మూసివేత సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తరువాత నుంచి మాత్రమే ముందస్తు మూసివేతకు అర్హత లభిస్తుంది. ఒకవేళ ఖాతాను ఒక సంవత్సరం తరువాత మూసివేయాలని అనుకుంటే, మొత్తం డిపాజిట్ లో 1.5 శాతం, అదే రెండు సంవత్సరాల తరువాత మూసివేయాలని అనుకుంటే, మొత్తం డిపాజిట్ లో 1 శాతం మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఖాతాదారుడికి అందచేస్తారు. ఒకవేళ మూడు సంవత్సరాల తరువాత మూసివేయాలని అనుకుంటే, ఎలాంటి మినహాయింపులు లేకుండా ఏ సమయంలోనైనా మూసివేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని