China Population: చైనా జనాభాలో రెండో ఏడాదీ క్షీణత

China Population: మరణాలు పెరగడం, జననాలు తగ్గడంతో చైనా జనాభాలో వరుసగా రెండో ఏడాదీ క్షీణత నమోదైంది.

Updated : 17 Jan 2024 13:01 IST

బీజింగ్‌: చైనా జనాభా (China Population)లో వరుసగా రెండో ఏడాదీ క్షీణత నమోదైంది. 2022తో పోలిస్తే గత ఏడాది ఆ దేశ జనాభా 20.8 లక్షలు తగ్గినట్లు జాతీయ గణాంకాల బ్యూరో బుధవారం వెల్లడించింది. జననాల రేటు తగ్గడం, కొవిడ్‌-19 ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మరణాలు పెరగడమే క్షీణతకు కారణమని పేర్కొంది.

వార్షిక ప్రాతిపదికన 2023లో మరణాలు రెండు రెట్లు పెరిగాయి. ఏడాది ఆరంభంలో కరోనా కేసులు పెరగడమే దీనికి కారణమని గణాంకాల బ్యూరో వివరించింది. ప్రస్తుతం దేశ జనాభా 140.96 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఇది ప్రస్తుతం ఆ దేశానికి పెను సవాలు విసురుతోంది. వృద్ధులు పెరగడం, శ్రామిక జనాభా తగ్గుతుండటంతో దేశ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

జననాల సంఖ్య వరుసగా ఏడో ఏడాదీ కుంగింది. 2023లో 90 లక్షల జననాలు నమోదయ్యాయి. 2016తో పోలిస్తే ఇది సగం మాత్రమే. 2016లో చైనా అధికారికంగా ఒకే బిడ్డ విధానానికి (One-Child policy) స్వస్తి పలికింది. ఇద్దరు, కావాలనుకుంటే ముగ్గురికీ జన్మనివ్వాలని ప్రోత్సహిస్తోంది. ఇది పెద్దగా ఫలితాలివ్వడం లేదు. పోషణ భారంగా మారడంతో అక్కడి ప్రజలు ఇంకా ఒకే బిడ్డ విధానం వైపే మొగ్గుచూపుతున్నారు. పిల్లలే వద్దనుకుంటున్నవారూ అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా జనాభా వృద్ధిరేటులో భారీ క్షీణత నమోదవుతూ వస్తోంది.

ఆర్థిక వృద్ధి రేటు 5.2%..

చైనా ఆర్థిక వ్యవస్థ (China Economy) గత ఏడాది 5.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఐదు శాతం లక్ష్యాన్ని అధిగమించడం గమనార్హం. స్థూల ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, దేశీయ గిరాకీని పెంచడం వంటి అంశాలు వృద్ధికి దోహదం చేసినట్లు గణాంకాల బ్యూరో తెలిపింది. పారిశ్రామికోత్పత్తి 4.6 శాతానికి పెరిగింది. వినియోగ వస్తువుల రిటైల్ విక్రయాల్లో 7.2 శాతం వృద్ధి నమోదైంది. ఫ్యాక్టరీ ఉపకరణాలు, నిర్మాణం, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చేసే పెట్టుబడులు మూడు శాతం వృద్ధి చెందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు