ఎన్‌పీఎస్‌లో అద‌నపు మిన‌హాయింపుల‌ను పొంద‌డ‌మెలా

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌)లో పెట్టుబ‌డులు పెట్టిన వారికి అద‌నంగా మ‌రో రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చ‌నే ప్ర‌తిపాద‌న‌ను 2015 బ‌డ్జెట్లో ప్ర‌తిపాదించారు. ప‌న్నులు లెక్కించ‌క ముందు ఉద్యోగి స్థూల వేత‌నంలో నుంచి ఈ మొత్తాన్ని మిన‌హాయించుకోవ‌చ్చు.....

Updated : 02 Jan 2021 16:24 IST

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌)లో పెట్టుబ‌డులు పెట్టిన వారికి అద‌నంగా మ‌రో రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చ‌నే ప్ర‌తిపాద‌న‌ను 2015 బ‌డ్జెట్లో ప్ర‌తిపాదించారు. ప‌న్నులు లెక్కించ‌క ముందు ఉద్యోగి స్థూల వేత‌నంలో నుంచి ఈ మొత్తాన్ని మిన‌హాయించుకోవ‌చ్చు. అయితే ఈ అద‌న‌పు మిన‌హాయింపుల‌ను ఎలా క్లెయిం చేసుకోవాల‌నే విష‌యంలో చాలా మంది అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెట్టేలా వ్య‌క్తులను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీసీడీ లో కొత్త‌గా స‌బ్ సెక్ష‌న్ 1(బీ)ను చేర్చింది. ఈ సెక్ష‌న్ ప్రకారం ఎన్‌పీఎస్‌లో మ‌దుపు చేసిన‌వారు అద‌నంగా మ‌రో రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కూ సెక్ష‌న్ 80 సీసీఈ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చన్న విష‌యం తెలిసిందే. అయితే ఏ ప్రాతిప‌దిక‌న ఈ అద‌న‌పు మొత్తాన్ని మిన‌హాయించుకోవ‌చ్చ‌న్న విషయంపై నిపుణులు ర‌క‌ర‌కాలుగా త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుత‌మున్న సెక్ష‌న్ 80 సీసీఈ ప్ర‌కారం వ్య‌క్తులు నిర్ధేశించిన ఆర్థిక సాధనాల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా త‌మ స్థూల వేత‌నం(ప‌న్నులు లెక్కించ‌క ముందు) రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు. కొత్త‌గా చేర్చిన నిబంధ‌న వ‌ల్ల ఈ ప‌రిమితికి మించి మ‌రో రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందే అవ‌కాశం ప‌న్ను చెల్లింపుదారుల‌కు క‌ల‌గ‌నుంది.

ప‌న్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వం నోటిఫై చేసిన‌ ఏదైనా పింఛ‌ను ప‌థ‌కంలో పెట్టుబ‌డిగా పెడితే వారికి త‌మ స్థూల‌ వేత‌నంలో 10 శాతం(వేత‌న జీవుల‌కు), 20 శాతం మొత్తం (స్వ‌యం ఉపాధి పొందేవారు) ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చ‌ని ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీసీడీ(1) తెలుపుతోంది. పైన తెలిపిన వివ‌ర‌ణల ప్ర‌కారం ఇలా పెట్టుబ‌డులు పెట్టేవారు సెక్ష‌న్ 80సీసీఈ ప్ర‌కార‌మూ ప్ర‌త్య‌క్షంగా లేదా ఉద్యోగి యాజ‌మాన్య సంస్థ ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.

అలాగే చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీసీడీ(1 బీ)లో స‌బ్ సెక్ష‌న్‌(1) ప్ర‌కారం ప‌న్ను చెల్లింపుదారుల స్థూల వేత‌నంలో నుంచి మిన‌హాయించుకున్న మొత్తం రూ.50 వేల‌కి మించ‌కూడ‌దు. అలాగే ఎన్‌పీఎస్‌లో ప్ర‌త్య‌క్షంగా లేదా త‌మ వేత‌నం నుంచి యాజ‌మాన్యం మిన‌హాయించుకుని పెట్టుబ‌డులు పెట్టిన వారు రూ.50 వేల వ‌ర‌కు అద‌నంగా ప‌న్ను మిన‌హాయంపులు పొంద‌వ‌చ్చ‌ని స‌బ్ సెక్ష‌న్‌(1 బీ) నిర్వ‌చిస్తోంది. అయితే యాజ‌మాన్యం త‌న వంతుగా ఉద్యోగుల ఎన్‌పీఎస్ ఖాతాల్లో జ‌మ చేయ‌డాన్ని 80 సీసీడీ యాక్ట్‌లోని స‌బ్ సెక్ష‌న్ 2 అభ్యంతరం వ్య‌క్తం చేస్తోంది. కాబ‌ట్టి ఉద్యోగుల త‌ర‌పును యాజ‌మాన్యం చేసే చెల్లింపుల‌కు ఈ అద‌న‌పు రూ.50 వేల ప‌న్ను మిన‌హాయింపులు వ‌ర్తించ‌వ‌ని ప్ర‌భుత్వ ఉద్ధేశంగా తెలుస్తోంది.

అయితే సెక్ష‌న్ 80 సీసీఈ ప్ర‌కారం ప‌న్ను చెల్లింపుదారులకు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొందే అవ‌కాశం ఉంది. ఒక వేళ అంత‌కుమించి జాతీయ పింఛ‌ను ప‌థ‌కంలో పెట్టుబడులు పెడితే సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) ప్ర‌కారం అద‌నంగా రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని