Published : 12 May 2022 14:17 IST

బీపీ, షుగ‌రు ఉన్నాయా?ఆరోగ్య బీమా తీసుకునేముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?


జీవ‌న శైలి వ్యాధుల‌తో పాటు, క‌రోనావైరస్ వంటి ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడే ప్రమాదం పెరగడంతో, ఆరోగ్య బీమా ఆవశ్యకత మ‌రింత పెరిగింది. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది అనారోగ్య స‌మ‌స్య‌లు పెరిగే అవ‌కాశం ఉంది. దీంతో వ్య‌క్తులు త‌మ‌తోపాటు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు త‌గిన విధంగా క‌వ‌ర్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. ఇక మ‌ధుమేహం, ఉబ్బ‌సం, ర‌క్త‌పోటు, క్యాన్స‌ర్‌, స్లీప్ అప్నియా వంటి ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధులు (ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీసెస్‌) ఉన్న‌ వారు ఆరోగ్య బీమా తీసుకోవడం మ‌రింత క‌ష్టం. పాల‌సీ కోసం అద‌నపు ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సి రావ‌చ్చు. ప్రీమియం కూడా అధికంగా ఉండ‌వ‌చ్చు. అందువ‌ల్ల ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధులు ఉన్న‌వారు పాల‌సీ తీసుకునే ముందు వివిధ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌గిన పాల‌సీని ఎంచుకోవాల్సి ఉంటుంది. 

వెయిటింగ్ పిరియ‌డ్‌..
ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల విష‌యంలో బీమా సంస్థ‌లు రిస్క్‌ను మూల్యాకనం చేసిన త‌ర్వాత మాత్ర‌మే పాల‌సీ జారీ చేసేందుకు ఆమోదిస్తాయి. అయితే పాల‌సీపై క‌నీస నిరీక్ష‌ణ వ్య‌వ‌ధి(వెయిటింగ్ పిరియ‌డ్‌) వ‌ర్తిస్తుంది. ఈ వెయిటింగ్ పిరియ‌డ్‌లో పాల‌సీదారు ఏదైనా అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే, వైద్య ఖ‌ర్చుల‌ను క్లెయిమ్ చేయ‌లేరు. వైద్యుల సంప్ర‌దింపు ఛార్జీలు, మెడిసిన్ బిల్లుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. 

పాల‌సీదారునికి ఉన్న అనారోగ్యాలు, వాటి తీవ్ర‌త‌, ముఖ్యంగా బీమా సంస్థ‌పై ఆధార‌ప‌డి వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. అందువ‌ల్ల పాల‌సీ తీసుకునే ముందే వివిధ బీమా సంస్థ‌లు అందించే ఆరోగ్య బీమా పాల‌సీల‌ను ప‌రిశీలించి తెలివిగా బీమా సంస్థ‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక‌వేళ మీ ప్ర‌స్తుత బీమా సంస్థ‌తో మీరు సంతృప్తిగా లేక‌పోతే మ‌రొక సంస్థ‌కు పాల‌సీ బ‌దిలీ చేసుకోవ‌చ్చు. పాల‌సీ బ‌దిలీ చేసుక‌న్న‌ప్పుడు వెయిటింగ్ పిరియ‌డ్ ప్ర‌యోజ‌నాలు కొత్త పాల‌సీకి బ‌దిలీ అయిన‌ప్ప‌టికీ వెయిటింగ్ పిరియ‌డ్ పూర్తైన త‌ర్వాత పోర్ట్ చేసుకోవ‌డం మంచిదని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

వైద్య చ‌రిత్రను దాచ‌కండి..
పాల‌సీ తీసుకునేట‌ప్పుడు బీమా సంస్థ‌కు మీ ప్రస్తుత లేదా గత వైద్య పరిస్థితిని వివ‌రించండి. ఒక‌వేళ ఏదైనా అనారోగ్యం గురించి దాచిపెట్టి పాల‌సీ తీసుకుంటే.. పాల‌సీ క్లెయిమ్ చేసిన‌ప్పుడు జ‌రిపే మూల్యంక‌నంలో మీరు దాచిపెట్టిన అంశాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. అలాంట‌ప్పుడు త‌ప్పు డిక్ల‌రేష‌న్ ఇచ్చిన కార‌ణంగా క్లెయిమ్‌ను తిరస్క‌రించి పాల‌సీని ర‌ద్దు చేయ‌వ‌చ్చు. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు, పోర్టబిలిటీ సమయంలో బీమా సంస్థకు ముందుగా ఉన్న అనారోగ్యాల గురించి సరైన సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం. 

రీసెర్చ్ చేయండి..
పాల‌సీ తీసుకునే ముందు వివిధ బీమా సంస్థ‌లు అందించే పాల‌సీల‌ను ప‌రిశోధించండి. కొన్ని బీమాసంస్థ‌లు ప్ర‌పోజ‌ర్ మొత్తం వైద్య చ‌రిత్ర‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుండ‌గా, చాలా వ‌ర‌కు సంస్థ‌లు ఇటీవలి చరిత్రను మాత్రమే అధ్య‌య‌నం చేస్తున్నాయి. అలాగే కొన్ని సంస్థ‌లు ఎక్కువ వెయిటింగ్ పిరియ‌డ్‌తో వ‌స్తుండ‌గా, మ‌రికొన్ని సంస్థ‌లు కొంచెం ఎక్కువ‌ ప్రీమియంతో వెయిటింగ్ పిరియ‌డ్‌ను త‌గ్గిస్తున్నాయి. అలాగే ఏదైనా కారణం చేత పాల‌సీ ర‌ద్ద‌యితే, తిరిగి పున‌రుద్ధ‌రించే రీఇన్‌స్టేట్‌మెంట్ ప్లాన్‌ను ఎంచుకోవ‌డం మంచిది. ఇలాంటి పాల‌సీల కోసం సెర్చ్ చేయండి. 

నివ‌సిస్తున్న ప్ర‌దేశం ఆధారంగా..
ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునే ముందు మీరు నివసించే నగరంలో ఆసుపత్రిలో చేరాల్సి వ‌స్తే అయ్యే సగటు ఖర్చును లెక్కించి, ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, టైర్ 1 సిటీ కంటే టైర్ 2 సిటీలో హాస్పిటలైజేషన్ ఖర్చులు తక్కువయ్యే అవకాశం ఉంది. ఒక‌వేళ మీరు  టైర్ 2 సిటీలో నివ‌సిస్తూ.. అదే నగరంలో చికిత్సలు పొందుతుంటే జోన్ వారీగా ప్రీమియం చెల్లించి అదనపు తగ్గింపులను పొందవచ్చు. అయితే, ఒక‌వేళ మీరు టైర్ 2 సిటిలో ఉంటూ.. టైర్ 1 సిటిలో చికిత్సలు పొందినట్లయితే ఇది వర్తించదు.

చివ‌రిగా..
ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీసెస్ ఉన్న‌వారు.. పాల‌సీ తీసుకునే ముందు బీమా సంస్థ నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితాను చూడాలి. మీరు నివ‌సించే ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆసుప్ర‌తులు బీమా సంస్థ జాబితాలో ఉన్న‌వి..లేనిది.. తెలుసుకోవాలి. దీని వ‌ల్ల అత్య‌వస‌ర స్థితిలో త‌క్ష‌ణ‌మే వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయి. ఆరోగ్య బీమా విష‌యంలో నిర్లక్ష్యం అస్స‌లు ఉండ‌కూడ‌దు. పాల‌సీ కొనుగోలు, బ‌దిలీ, అప్‌గ్రేడ్ వంటివి స‌మ‌యానికి చెయ్యాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని