Luna: 100% పతనమైన క్రిప్టోకరెన్సీ లూనా.. 7రోజుల్లో ‘సున్నా’ డాలర్లకు

క్రిప్టోమార్కెట్‌లో కీలక కరెన్సీల పతనం కొనసాగుతోంది. అత్యధిక లావాదేవీలు జరిగే బిట్‌ కాయిన్‌ సహా అన్ని కరెన్సీలు నేలచూపులు చూస్తున్నాయి....

Published : 14 May 2022 20:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిప్టోమార్కెట్‌లో కీలక కరెన్సీల పతనం కొనసాగుతోంది. అత్యధిక లావాదేవీలు జరిగే బిట్‌ కాయిన్‌ సహా అన్ని కరెన్సీలు నేలచూపులు చూస్తున్నాయి. స్థిరంగా ఉండే క్రిప్టోకరెన్సీగా భావిస్తున్న టెర్రాయూఎస్‌డీకి సిస్టర్‌ టోకెన్‌గా చెప్పుకునే టెర్రాయూఎస్‌డీ లూనా విలువ ఏకంగా సున్నా డాలర్లకు పడిపోయింది. దీంతో దాని మార్కెట్‌ విలువ 100 శాతం తరిగిపోయినట్లయింది. 

ఏప్రిల్‌ 5న లూనా 116 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. కాయిన్‌మార్కెట్‌క్యాప్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. గత ఏడు రోజుల్లో ఈ టోకెన్‌ విలువ 40 బిలియన్‌ డాలర్ల నుంచి 6 మిలియన్‌ డాలర్లకు పడిపోవడం గమనార్హం. టెర్రాయూఎస్‌డీ విలువ దిగజారడం ప్రారంభమైనప్పటి నుంచి లూనా పతనమవుతూ వచ్చింది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన బైనాన్స్‌.. టెర్రాయూఎస్‌డీ, లూనాను తాత్కాలికంగా డీలిస్ట్‌ చేస్తున్నట్లు మే 13న ప్రకటించింది. భారత ఎక్స్ఛేంజీలయిన వజీరిక్స్‌, కాయిన్‌స్విచ్‌ కుబర్‌, కాయిన్‌డీసీఎక్స్‌ సైతం అదే బాటలో పయనించాయి. దీంతో లూనా విలువ పూర్తిగా పతనమైంది.

శనివారం సాయంత్రం 5:10 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో బిట్‌కాయిన్‌ విలువ 4.81 శాతం పతనమై 28,928 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇథేరియం 5.25 శాతం తగ్గి 1,976 డాలర్ల వద్ద, టెథర్‌ 0.07 శాతం కుంగి 0.99 డాలర్లు, యూఎస్‌డీ కాయిన్‌ 0.05 శాతం పడి ఒక డాలర్‌ వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని