రక్షణ బడ్జెట్‌ నిధుల వ్యయ పర్యవేక్షణకు కమిటీ: రాజ్‌నాథ్‌

బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన నిధుల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు....

Published : 25 Feb 2022 20:46 IST

దిల్లీ: బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన నిధుల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆయుధ కొనుగోళ్ల విభాగపు డైరెక్టర్‌ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు ఉంటారన్నారు. సకాలంలో నిధులన్నింటినీ వినియోగించుకునేలా వీరు ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. రక్షణ ఎగుమతుల్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు తాజా బడ్జెట్‌ కేటాయింపులు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వివిధ వర్గాల నుంచి వచ్చిన అన్ని వినతులు, సలహాలు, సూచనల్ని పరిగణనలోకి తీసుకున్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. వాటిని అనుసరించి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్ని ఎలా ఖర్చు చేయాలో ఓ కార్యాచరణను రూపొందించామన్నారు. వాటిని సకాలంలో అమలు చేసి భారత్‌ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు ప్రోత్సహించడంలో భాగంగా 2022-23లో మేక్‌-I కింద కనీసం ఐదు ప్రాజెక్టులకు అనుమతి ఇస్తామని మంత్రి తెలిపారు. వీటికి కావాల్సిన నిధుల్లో 90 శాతం ప్రభుత్వమే భరిస్తుంది. అయితే, ప్రాజెక్టు పురోగతిని బట్టి దశలవారీగా నిధులను విడుదల చేస్తారు. ముఖ్యంగా ప్రైవేటు పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని