Auto debit: ఆటో డెబిట్‌.. ఇకపై ఓటీపీ లేకుండానే రూ.15వేల వరకు

క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూనిఫైడ్ పేమెంట్స్‌ ఇంటరఫేస్‌ (యూపీఐ) లేదా ఇతర ముందస్తు చెల్లింపు (ప్రీపెయిడ్‌) సాధనాల ద్వారా జరిపే ఆటో డెబిట్‌ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

Updated : 08 Jun 2022 14:37 IST

దిల్లీ: క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూనిఫైడ్ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ UPI) లేదా ఇతర ముందస్తు చెల్లింపు (ప్రీపెయిడ్‌) సాధనాల ద్వారా జరిపే ఆటో డెబిట్‌ (Auto Debit) లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) (RBI) కీలక ప్రకటన చేసింది. అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్‌ఏ‌) అవసరం లేని ఆటో డెబిట్ పరిమితిని రూ.5000 నుంచి రూ.15వేలకు పెంచింది. అంటే, ఇకపై వినియోగదారులు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే రూ.15వేల వరకు ఆటో డెబిట్‌గా పెట్టుకోవచ్చు.

ప్రస్తుతం విద్యుత్‌ బిల్లుల దగ్గర నుంచి గ్యాస్‌ బిల్లుల వరకు నెలవారీ ఖర్చులను చెల్లించేందుకు చాలా మంది డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లేదా యూపీఐల ద్వారా ‘ఆటో డెబిట్‌ (Auto Debit)’ పద్ధతిని ఉపయోగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటో డెబిట్‌ (Auto Debit) లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ గతేడాది అక్టోబరు నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి తెచ్చింది. వాటి ప్రకారం.. ఆటో డెబిట్‌ తేదీ, డెబిట్ అయ్యే నగదు మొత్తం వంటి వివరాలను కనీసం 24 గంటల ముందే బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారు అనుమతి అనంతరమే ఆటో డెబిట్‌ లావాదేవీని పూర్తి చేయాలి. అంతేగాక, రూ.5000లకు మించిన ఆటో డెబిట్‌ (Auto Debit) చెల్లింపులకైతే వినియోగదారులు.. వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)వంటి అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను మాన్యువల్‌గా చెప్పాల్సి ఉంటుంది.

అయితే కస్టమర్ల సౌకర్యార్థం ఈ పరిమితిని పెంచినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. ఇకపై ఆటో డెబిట్‌ (Auto Debit)చెల్లింపు మొత్తం రూ.15వేలు దాటితేనే కస్టమర్లను బ్యాంకులు అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషేన్ అడగాల్సి ఉంటుంది. రూ.15000 వరకు జరిపే ఆటో డెబిట్ లావాదేవీలకు ఎలాంటి ఓటీపీని ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ వెలువడనుంది. తాజా నిర్ణయంతో కస్టమర్లు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే ఎడ్యుకేషన్‌ ఫీజులు, బీమా ప్రీమియంలు వంటి పెద్ద మొత్తాలను కూడా ఆటో డెబిట్‌ (Auto Debit) పద్ధతిలో చెల్లించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని