Credit Cards: క్రెడిట్‌ కార్డుల ద్వారా క్యాష్‌బ్యాక్‌ ఎలా సంపాదించాలి?

క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్‌ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి.

Published : 02 May 2024 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాష్‌బ్యాక్‌ అనేది వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులు అందించే ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి. ఇది క్రెడిట్‌ కార్డుదారులకు రివార్డ్‌ వంటిది. క్రెడిట్‌ కార్డులపై ఖర్చు చేస్తున్నప్పుడు సంపాదించడానికి మంచి అవకాశాన్ని అందిస్తాయి. సాధారణ ఖర్చులకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అయినప్పటికీ, కార్డుదారులు వారి ఆర్థిక అలవాట్లు, అవసరాలు, చెల్లింపుల క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని వాటిని తెలివిగా ఉపయోగించడం చాలా అవసరం. క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ కార్డుతో వస్తువులను కొనుగోలు చేయడానికి కార్డు స్వైప్‌ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు వీలుంటుంది. ఇది కార్డుదారుడికి పాయింట్లు లేదా నగదు రూపంలో రావొచ్చు. చాలా క్రెడిట్‌ కార్డులు కిరాణా, ఆహారం, లైఫ్‌ స్టైల్‌, వినోదం, ఎలక్ట్రానిక్స్‌, బిల్లుల చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి.

క్యాష్‌బ్యాక్‌

క్యాష్‌బ్యాక్‌గా మొత్తం వినియోగదారులు ఉపయోగించే క్రెడిట్‌ కార్డు రకాన్ని బట్టి ఉంటుంది. కార్డును ఉపయోగించి కార్డుదారుడు చేసే ఖర్చులలో భాగంగా క్యాష్‌బ్యాక్‌ అందుతుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ కార్డుదారుడి ఖాతాకు క్రెడిట్‌ చేస్తారు లేదా తదుపరి బిల్లు చెల్లింపు సమయంలో సర్దుబాటు చేస్తారు. కొన్ని క్రెడిట్‌ కార్డులతో క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను పెంచుకోవచ్చు. చాలా వరకు క్యాష్‌బ్యాక్‌ అందించే క్రెడిట్‌ కార్డులు.. ఇంధనం, ప్రయాణాలు, డైనింగ్‌, సూపర్‌ మార్కెట్స్‌/ స్టోర్స్‌లో కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ లేదా లైఫ్‌ స్టైల్‌ కొనుగోళ్లు వంటి నిర్దిష్ట ఖర్చులకు క్యాష్‌బ్యాక్‌లను అందించడంపై దృష్టి పెడతాయి.

కార్డు ఎంపిక

క్రెడిట్‌ కార్డు ద్వారా ప్రతి చెల్లింపుపై ఎక్కువ క్యాష్‌బ్యాక్‌ రివార్డ్స్‌ పొందడానికి, ముందుగా సరైన కార్డును ఎంచుకోవాలి. కొన్ని కార్డులు ఏడాది పొడవునా క్యాష్‌బ్యాక్‌ సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని పండుగ విక్రయాల వంటి నిర్దిష్ట సందర్భాలలో మాత్రమే అందిస్తాయి. మీరు డబ్బు ఖర్చు చేసే విధానం ఆధారంగా తగిన కేటగిరీ క్రెడిట్‌ కార్డు ఎంచుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. కార్డు తీసుకునే ముందు మీరు ప్రతి నెలా ఏ కేటగిరీ ఖర్చులు ఎక్కువగా చెల్లిస్తున్నారో తనిఖీ చేయండి. దీంతో ఆ కేటగిరీకి చెందిన కార్డును ఎంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ లాభాలతో అత్యుత్తమ డీల్స్‌ పొందొచ్చు. భారత్‌లో క్రెడిట్‌ కార్డులపై క్యాష్‌బ్యాక్‌ ఫీచర్లు వినియోగదారులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి.

రివార్డ్స్‌ ఎంత?

కొన్ని కార్డులు అధిక రుసుములతో వచ్చినప్పటికీ, మెరుగైన క్యాష్‌బ్యాక్‌ రివార్డ్స్‌ను అందిస్తాయి. కార్డులు అన్ని కొనుగోళ్లపై ఒకే రకమైన క్యాష్‌బ్యాక్‌ అందించవు. కొన్ని కార్డులు కిరాణా సామాగ్రిపై 5% క్యాష్‌బ్యాక్‌ అందించవచ్చు. అవే కార్డులు ఇంధనం లేదా డైనింగ్‌పై 1% మాత్రమే రివార్డ్స్‌ అందిస్తాయి. అయితే, క్యాష్‌బ్యాక్‌ రివార్డ్స్‌ను పొందడం కోసం క్రెడిట్‌ కార్డు బిల్లును పెంచకూడదు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురై అసలు ప్రయోజనాలు దెబ్బతింటాయి. క్రెడిట్‌ కార్డులు జారీచేసేవారు అందించిన వెల్‌కం ఆఫర్స్‌, సైన్‌-అప్‌ బోనస్‌లను ఉపయోగించుకోవచ్చు. కొన్ని క్రెడిట్‌ కార్డులు నిర్దిష్ట వ్యాపారులు లేదా బ్రాండ్స్‌తో టై-అప్స్‌ కలిగి ఉంటాయి. వారి వద్ద షాపింగ్‌ చేసేటప్పుడు అదనపు క్యాష్‌బ్యాక్‌ లేదా డిస్కౌంట్స్ పొందొచ్చు. క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ కార్డులతో మీరు స్వైస్‌ చేసిన ప్రతిసారీ నగదు రూపంలో లేదా రివార్డ్‌ పాయింట్ల రూపంలో కొంత మొత్తం మీ ఖాతాకు జమ అవుతుంది. ఉదాహరణకు మీరు ఐసీఐసీఐ బ్యాంక్ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డు ప్రైమ్‌ మెంబర్‌గా ఉన్నట్లయితే.. అమెజాన్‌ ఇండియా కొనుగోళ్లపై 5% వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు.

రివార్డ్స్‌ ఎక్కువ పొందడానికి..

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అందరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. చాలా క్రెడిట్‌ కార్డులు ఆన్‌లైన్‌ రిటైలర్స్‌/ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో భాగస్వామి వెబ్‌సైట్స్‌ కొనుగోళ్లపై ఎక్కువ క్యాష్‌బ్యాక్‌ రివార్డ్స్‌ను పొందే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా క్రెడిట్‌ కార్డుల ద్వారా యుటిలిటీ బిల్లులు, ఫోన్‌ బిల్లులు, బీమా ప్రీమియంల వంటి రెగ్యులర్‌ ఖర్చులను చేయడం వల్ల మరిన్ని క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రత్యేక ఆఫర్లు/డిస్కౌంట్స్‌ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలు వంటి పెద్ద కొనుగోళ్లు చేయడం వలన క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశముంది. మరికొన్ని కార్డులు.. విమాన, హోటల్‌, కారు అద్దె బుకింగ్‌ల కోసం క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను అందిస్తూ ప్రయాణ సంబంధిత ఫీచర్‌లపై దృష్టి సారిస్తాయి. ఎయిర్‌లైన్‌ మైల్స్‌/హోటల్‌ పాయింట్ల వంటి లాయల్టీ ప్రోగ్రామ్స్‌తో సంబంధమున్న క్రెడిట్‌ కార్డుల్లో సంపాదించిన పాయింట్లపైన అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని