కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా

అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి.

Published : 10 May 2024 01:12 IST

అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడే జీవిత బీమా అవసరం ఏమిటో అర్థం అవుతుంది. ముఖ్యంగా తక్కువ ప్రీమియంతో అధిక రక్షణనిచ్చే టర్మ్‌ బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరం అవుతున్నాయి.

జీవిత బీమా ప్రయోజనంతో పాటు, పన్ను ఆదా కోసమూ టర్మ్‌ పాలసీలను చాలామంది తీసుకుంటున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వీటిలో చాలా రకాలే వచ్చాయి. దేన్ని ఎంచుకున్నా.. చూడాల్సిన మొదటి విషయం ఆ పాలసీ కుటుంబానికి ఎంత మేరకు ధీమానిస్తుందనేది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని విషయాలను పరిశీలిస్తే..

అవసరం ఉందా?

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకునేందుకు ముందుగా అవసరం ఏమిటన్నది ముఖ్యం. ఒక వ్యక్తి మరణిస్తే.. ఆర్థికంగా ఎంతమంది ప్రభావితం అవుతారన్న సంగతిని ముందుగా పరిశీలించాలి. వ్యక్తిపై ఆధారపడిన వారున్నప్పుడు తప్పనిసరిగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అవసరమే. ఊహించని సంఘటనల వల్ల ఆర్జించే వ్యక్తి దూరమైనప్పుడు, ఆ ఆర్థిక లోటు అతనిపై ఆధారపడిన వారికి కనిపించకూడదు. ఇలా ఆలోచించి, టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలి.

ఎంత మేరకు?

టర్మ్‌ పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలని చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. మీ ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తులో మీరు సంపాదించబోయే మొత్తం ఆధారంగా దీన్ని నిర్ణయించుకోవాలి. మీ ప్రస్తుత నికర ఆదాయంలో నుంచి దాదాపు 10 నుంచి 20 రెట్ల వరకూ ఈ పాలసీ ద్వారా బీమా తీసుకోవాలి. కనీసం 200 నెలల వేతనానికి సమానమైన మొత్తానికి తక్కువ కాకుండా దీని విలువ ఉండాలి. అప్పుడే ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ కల్పించినట్లు అవుతుంది.

బాధ్యతల మాటేమిటి?

వార్షిక ఆదాయం ఆధారంగా కనీస బీమా మొత్తాన్ని మాత్రమే నిర్ణయించగలం. కానీ, వ్యక్తికి బాధ్యతలు ఉంటాయి. మరి వాటి సంగతేమిటి? పిల్లల చదువులు, పెళ్లి, ఇల్లు, కారు రుణాలు ఇలా ఎన్నో బరువులు ఉంటాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎంత మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకుంటే మంచిదనేది తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ కాలిక్యులేటర్లను వినియోగించుకోవచ్చు.

క్లెయిముల చరిత్ర చూడండి..

పాలసీని తీసుకునేందుకు బీమా సంస్థను ఎంచుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. క్లెయిముల చెల్లింపుల చరిత్రను పరిశీలించడం మర్చిపోవద్దు. క్లెయిముల చెల్లింపుల నిష్పత్తి బీమా సంస్థ విశ్వసనీయతను చెబుతుంది. దీనికోసం ఐఆర్‌డీఏఐ వెబ్‌సైటును చూడొచ్చు. ఆయా సంస్థల వెబ్‌సైట్లలోనూ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

అనుబంధ పాలసీలతో..

రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీకి అనుబంధంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌, డిజేబిలిటీ కవర్‌లాంటి రైడర్లను జోడించుకునేందుకు అవకాశం ఉంది. వీటికి అదనంగా కొంత ప్రీమియం ఉంటుంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు అవసరం మేరకు వీటినీ ఎంచుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక భరోసా పెరుగుతుంది.

అన్ని వివరాలూ చెప్పండి..

పాలసీని తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంలో అన్ని వివరాలనూ స్పష్టంగా తెలియజేయండి. ముఖ్యంగా ఆహార అలవాట్లు, ఆరోగ్య, ఆర్థిక వివరాల్లో ఎలాంటి తప్పులూ ఉండకూడదు. బీమా ఒప్పందంలో ఇరు పక్షాలూ పూర్తి పారదర్శకంగా ఉండాలి. నిజాలను దాచిపెడితే.. క్లెయిము సందర్భంలో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి, బీమా సంస్థ అడిగిన సమాచారాన్ని మొత్తం తెలియజేయండి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకూ సిద్ధంగా ఉండండి.

ప్రీమియం వెనక్కి ఇచ్చేలా..

టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. పాలసీదారుడు మరణించినప్పుడు పరిహారం మాత్రమే ఇస్తుంది. దీనికి భిన్నంగా ఇప్పుడు ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చే పాలసీలూ అందుబాటులోకి వచ్చాయి. వీటికి ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది. గడువు తీరే లోపు ఎలాంటి క్లెయిమూ లేకపోతే.. కొన్ని రుసుములను మినహాయించుకొని, మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఈ పాలసీని ఎంచుకోవాలి. దీనికన్నా ప్రీమియం వెనక్కి ఇవ్వని పాలసీలే మేలు అని నిపుణులు సూచిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని