భూలోక కుబేరుడు.. కారు రిపేరుకు డబ్బులు లేవట!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌.. ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న విషయం

Published : 13 Jan 2021 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌.. ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన కేవలం కార్ల సంస్థనే కాదు, స్పేస్‌ ఎక్స్‌, పే పాల్‌ వంటి అనేక కంపెనీలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్న వ్యాపారవేత్త. ఏ కంపెనీని ప్రారంభించినా అందులో ఊహించని ఫలితాలు, లాభాలు సంపాదించగల ఘనుడు. అలాంటి ఎలన్‌ మస్క్‌ వద్ద ఒకప్పుడు కారుకు మరమ్మతులు చేయించేందుకు కూడా డబ్బులు ఉండేవి కాదట. అందుకే తన కారుకు తానే స్వయంగా మరమ్మతులు చేసుకునేవాడినని చెప్పారు. ఎలన్‌కు సంబంధించిన ఒక ఫొటోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్టు చేయగా.. దానికి ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఎలన్‌ మస్క్‌ ఓ కారుకు మరమ్మతులు చేస్తూ దిగిన ఫొటోను ప్రణయ్‌ పాతోల్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేస్తూ ‘1995లో ఎలన్‌ మస్క్‌.. తన కారు మరమ్మతులకు డబ్బులు చెల్లించే స్థోమత లేక తానే మరమ్మతులు చేసుకుంటున్నారు’అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ ఎలన్‌కు చేరడంతో దీనిపై స్పందిస్తూ ‘కారు గ్లాస్‌ మార్చడం కోసం మరో గ్లాస్‌ను జంక్‌యార్డ్‌ (పాత వాహనాలను తుక్కుగా వేసే ప్రాంతం)లో 20 డాలర్లకే కొన్నాను. కారుకు సంబంధించి విడిభాగాలు కొనుగోలు చేయడానికి అదే మంచి చోటు’ అని రీట్వీట్‌ చేశారు. నిజానికి ఆ ఫొటోను ఎలన్‌ మస్క్‌ తల్లి మాయె మస్క్‌ 2019లో పోస్టు చేశారు. ఆ ఫొటో పోస్టుకు ఎలన్‌ సమాధానమిస్తూ ‘అప్పట్లో కారు మరమ్మతులకు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అందుకే కారులో సమస్యలున్న అన్ని భాగాలను జంక్‌యార్డ్‌ నుంచి కొనుగోలు చేసిన విడిభాగాలతో సరి చేశాను. పగిలిన సైడ్‌ విండో గ్లాస్‌ను మారుస్తూ ఫొటోలో కనిపిస్తున్నది నేనే.’’అని పేర్కొన్నారు. 1993లో ఎలన్‌.. 1,400 డాలర్లు పెట్టి 1978 మోడల్‌ బీఎండబ్ల్యూ 320ఐ కారును కొనుగోలు చేశారు. దానికే మరమ్మతులు చేస్తూ ఈ ఫొటో దిగారు. 

ప్రపంచ కుబేరుడిగా మారిన ఎలన్‌ 1971 జూన్‌ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన తండ్రి ఎరోల్‌ మస్క్‌ ఎలక్ట్రోమెకానికల్‌ ఇంజినీర్‌. అంతేకాదు, పైలట్‌, నావికుడు, స్థిరాస్తి వ్యాపారి. తల్లి మాయె మస్క్‌ మోడల్‌, డైటీషియన్‌. ఎలన్‌ కుటుంబం మొదటి నుంచి ఎగువ మధ్యతరగతి కుటుంబమే. 1995లో ఎలన్‌ తన సోదరుడు మరో వ్యక్తితో కలిసి జిప్‌2 అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించారు. ఆ తర్వాత ఎక్స్‌ డాట్‌ కామ్‌, పేపాల్‌, స్పేస్‌ ఎక్స్‌, టెస్లా ఇలా అనేక కంపెనీలు ప్రారంభించి కోట్లకు పడగలెత్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని