Updated : 20 Jun 2022 15:18 IST

ESI: ఇక దేశ‌వ్యాప్తంగా ఈఎస్ఐ సేవ‌లు.. త్వరలో విస్తరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈఎస్ఐ ప‌థ‌కాన్ని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌ని ఆ సంస్థ నిర్ణ‌యం తీసుకుంది. 2022 చివ‌రి నాటికి దేశ‌వ్యాప్తంగా మొత్తం 744 జిల్లాల‌కు ఈ పథకం విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈఎస్ఐసీ 188వ స‌మావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం చాలా మంది కార్మికుల‌కు ఆరోగ్యప‌రంగా వ‌ర‌మ‌నే చెప్పాలి. ఈఎస్ఐలో స‌భ్య‌త్వం ఉంటే సొంతంగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌కుండా ఔట్ పేషంట్ సేవ‌లే కాకుండా ఇన్ పేషంట్ సేవ‌లు, ఆప‌రేష‌న్లు చేయించుకోవ‌డం, మందులు పొంద‌డం లాంటి అనేక సేవ‌ల‌ను ఉచితంగా పొందొచ్చు. ఈఎస్ఐ ఆసుప‌త్రిలో లేని సేవ‌లు బ‌య‌ట కార్పొరేట్ ఆసుప‌త్రుల‌లో ఉంటే వాటిని కూడా ఈఎస్ఐ ఆసుప‌త్రి వ‌ర్గాలు రిఫ‌ర్ చేస్తాయి.

ప్ర‌స్తుతం ఈఎస్ఐ ప‌థ‌కం దేశంలో 443 జిల్లాల్లో పూర్తిగా, 153 జిల్లాల్లో పాక్షికంగా అమ‌లవుతోంది. దేశంలో 148 జిల్లాలు దీని ప‌రిధిలోకి రావు. ఈ ప‌థ‌కాన్ని 25 వేల మంది ఉద్యోగుల‌తో దిల్లీ, కాన్పూర్‌ల‌లో 1952 ఫిబ్ర‌వ‌రి 24న మొట్ట‌మొద‌టిగా ప్రారంభించారు. 2021 మార్చి 31 నాటికి ఈఎస్ఐసీ బీమా పొందిన వ్య‌క్తులు, వారి కుటుంబ స‌భ్యులు మొత్తం 13.1 కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందారు. ప్ర‌స్తుతం 154 ఈఎస్ఐ ఆసుప‌త్రులు, 1,570 డిస్పెన్స‌రీలు, 76 డిస్పెన్స‌రీలతో కూడిన‌ శాఖా కార్యాల‌యాలతో నెట్‌వర్క్ ద్వారా వైద్య సౌక‌ర్యాల‌ను ఈఎస్ఐసీ విస్త‌రించింది.

హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఈఎస్ఐసీ అనేక నిర్ణ‌యాలు తీసుకుంది. బీమా పొందిన కార్మికులు, వారిపై ఆధార‌ప‌డిన వారికి నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌ను అందించ‌డానికి దేశ‌వ్యాప్తంగా 23 కొత్త 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రులు, అనేక డిస్పెన్స‌రీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఈఎస్ఐ నిర్ణ‌యించింది. కొత్త ఆసుప‌త్రుల ఏర్పాటుకు స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి, ఈఎస్ఐసీ త‌న స‌మావేశంలో బీమా కలిగిన కార్మికులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న ద్వారా న‌గ‌దు ర‌హిత వైద్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను పొందేందుకు అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది. ఈఎస్ఐ ప‌థ‌కం ఉన్న అన్ని ప్రాంతాల్లో పాక్షికంగా దీన్ని అమలు చేస్తారు. 157 జిల్లాల్లో ఈఎస్ఐ ప‌థ‌కం ల‌బ్దిదారులు ఇప్ప‌టికే ఈ ఏర్పాటు ద్వారా న‌గ‌దు ర‌హిత వైద్య సేవ‌ల‌ను పొందుతున్నారు.

ఈఎస్ఐ ప‌థ‌కం అన్ని కర్మాగారాలు, ఆఫీసులు, షాపుల్లో నెల‌కు రూ.21,000 వ‌ర‌కు మూలవేతనం ఉండి, 10 లేదా అంత‌కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఈ ప‌థ‌కంలో ఉద్యోగి వేత‌నంలో య‌జ‌మాని 3.25%, ఉద్యోగి 0.75%ని చందా కింద జ‌మ చేస్తారు. ఈఎస్ఐసీ, దాని స‌భ్యులు అంటే.. బీమా కలిగిన ఉద్యోగులు, ల‌బ్ధిదారులైన వారి కుటుంబ స‌భ్యుల‌కు ఉచిత వైద్య సంర‌క్ష‌ణ‌ను అంద‌చేస్తుంది. చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చుపై ప‌రిమితి లేదు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది, శాశ్వ‌తంగా విక‌లాంగులైన బీమా పొందిన వ్య‌క్తుల‌కు, వారి జీవిత భాగ‌స్వాముల‌కు టోకెన్ వార్షిక ప్రీమియం రూ.120 చెల్లింపుపై కూడా వైద్య సంర‌క్ష‌ణ అందిస్తారు. ఉపాధిలో ఉండ‌గా గాయాలు, వృత్తి స‌మ‌స్య‌ల వ‌ల్ల అనారోగ్యం, మ‌ర‌ణం లేదా అంగ‌వైక‌ల్యం వంటి ఆక‌స్మిక ప‌రిస్థితుల్లో కూడా ఈ ఈఎస్ఐ స‌భ్య‌త్వం ఉన్న‌వారికి సాయం అందుతుంది. అంతేకాకుండా వృత్తిలో తీవ్ర గాయాలయ్యి, ప‌నిచేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌వారికి నిరుద్యోగ భృతిని కూడా అందిస్తుంది.

2020 సెప్టెంబర్‌లో ఆమోదం పొందిన సామాజిక భ‌ద్ర‌తా కోడ్‌లో ఉన్న గ‌రిష్ఠ కార్మికుల‌కు ఈఎస్ఐసీ కింద ఆరోగ్య భ‌ద్ర‌త హ‌క్కును అందిస్తుంది. దీంతో అద‌నంగా ప్లాంటేషన్ వర్కర్స్, వీధుల్లో ప‌నిచేసే కార్మికులు, 10 మంది కంటే త‌క్కువ కార్మికులు ఉన్న సంస్థ‌ల‌కు విస్త‌రించాల‌ని ప్ర‌తిపాదించారు. ఒక సంస్థ‌లో రిస్క్‌తో కూడిన ప‌ని ఉంటే, ఆ సంస్థ‌లో ఒక్క‌రే కార్మికుడు ఉన్న‌ప్ప‌టికీ ఈఎస్ఐసీ ప‌రిధిలోకి వస్తారు. అంతేకాకుండా దేశంలో ఉన్న సుమారు 38 కోట్ల అసంఘ‌టిత రంగ కార్మికులంద‌రినీ త‌న సామాజిక ఆరోగ్య బీమా ప‌రిధిలోకి తీసుకురావాల‌ని భార‌త ప్ర‌భుత్వం యోచిస్తోంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts