LIC Policy revival: రద్దయిన ఎల్‌ఐసీ పాలసీని ఎలా పునరుద్ధరించుకోవాలి?

ప్రీమియం చెల్లించనందున, రద్దయిన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది.....

Updated : 11 Feb 2022 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రీమియం చెల్లించనందున రద్దయిన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ‘స్పెషల్‌ రివైవల్‌ క్యాంపెయిన్‌’ పేరుతో ఈ నెల 7 నుంచి వచ్చే నెల 25 వరకూ ఈ అవకాశం ఉండనుంది.

ఎందుకీ స్పెషల్‌ క్యాంపెయిన్‌..

కొవిడ్‌-19 పరిస్థితుల్లో జీవిత బీమా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రద్దయిన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎల్‌ఐసీ పేర్కొంది. నిర్లక్ష్యం, డబ్బు కొరత, నివాస స్థల మార్పు వంటి అనివార్య కారణాల వల్ల ప్రీమియాన్ని సకాలంలో చెల్లించని పాలసీదారులకూ ప్రయోజనం కల్పించేందుకు ఈ పునరద్ధరణ పథకం తోడ్పడుతుందని తెలిపింది. పైగా రద్దయిన పాలసీ అంటే.. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియాలన్నీ రద్దయినట్లే. వాటి ప్రయోజనం తిరిగి పొందాలన్నా పునరుద్ధరణ ఓ మంచి అవకాశం.

ఇలా ప్రత్యేక సమయాల్లోనే పునరుద్ధరిస్తారా?

గత అయిదేళ్లుగా ప్రీమియం చెల్లించకుండా ఉన్న పాలసీలను పునరుద్ధరణ చేసుకునేందుకు అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ప్రీమియం చెల్లింపునకు వీలుండి, ఇంకా వ్యవధి ఉన్న పాలసీలను కొన్ని నిబంధనల మేరకు తిరిగి అమల్లోకి తీసుకురావచ్చు. చెల్లించాల్సిన ప్రీమియాలకు ఆలస్యపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలా ప్రత్యేక పథకాలు తీసుకొచ్చినప్పుడు ఆలస్య రుసుము సహా ఇతరత్రా జరిమానాల నుంచి కొంత రాయితీ లభిస్తుంది. 

ఎల్‌ఐసీ ఎలాంటి రాయితీలిస్తోంది?

రూ.లక్ష లోపు ప్రీమియం చెల్లించే వారికి ఆలస్యపు రుసుములో 20శాతం (గరిష్ఠంగా రూ.2,000) రాయితీ లభిస్తుంది. రూ.1- 3లక్షల లోపు ప్రీమియం ఉంటే 25 శాతం గరిష్ఠంగా రూ.2,500 వరకు ఆలస్యపు రుసుము తగ్గుతుంది. రూ.3 లక్షలు, ఆపైన ప్రీమియానికి వర్తించే ఆలస్యపు రుసుములో 30 శాతం, గరిష్ఠంగా రూ.3 వేల వరకు రాయితీ ఉంటుందని తెలిపింది. టర్మ్‌ పాలసీలకు, అధిక రిస్కు ఉన్న పాలసీలకు ఈ రాయితీ వర్తించదు. ఆరోగ్య పరీక్షల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు.

పునరుద్ధరించుకోవచ్చా?

రద్దయిన పాలసీని పునరుద్ధరించుకోవాలా? వద్దా? అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పాలసీ తీసుకున్నారు? ఎంత ప్రీమియం చెల్లించారు? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ చెల్లించిన ప్రీమియం పెద్ద మొత్తంలో లేకుంటే పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చెల్లించినట్లైతే.. అలాగే వాటి విలువ సరెండర్‌ విలువకు దగ్గరగా ఉంటే కచ్చితంగా పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కాస్ట్‌-బెనిఫిట్‌ విశ్లేషణ ద్వారా నిర్ణయం తీసుకోవాలి.

మరోవైపు, త్వరలో ఎల్‌ఐసీ ఐపీఓకి రానున్న విషయం తెలిసిందే. దీనిపై వాణిజ్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైగా చాలా మంది ఈ ఐపీఓపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమ పాలసీదారులకు ఇష్యూ ధరలో కొంత రాయితీ ఇవ్వాలని సంస్థ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని ప్రయోజనం పొందాలంటే కచ్చితంగా ఎల్‌ఐసీలో పాలసీ ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని