ఆస్ట్రేలియాలో  వార్తాసేవలు నిలిపేసిన ఫేస్‌బుక్‌

తమ సామాజిక మాధ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన వార్త సంస్థలు పంచుకొనే సమాచారాన్ని

Updated : 18 Feb 2021 19:49 IST

నూతన నిబంధనలకు మేమూ వ్యతిరేకమే: గూగుల్‌


కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన వార్త సంస్థలు పంచుకొనే సమాచారాన్ని చదవగల సదుపాయాన్ని ఫేస్‌బుక్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఆ దేశ వాసులు ఫేస్‌బుక్‌లో వార్తలను చదివే అవకాశాన్ని కూడా ఆపేసింది. వార్తలను పంచుకొన్నందుకు ఆయా సంస్థలకు ఫేస్‌బుక్‌ రుసుము చెల్లించాలన్న నిబంధన ఆ దేశంలో అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.

వేరే దారి లేదు..

‘‘మా ముందు ఎంచుకునేందుకు రెండే మార్గాలు కనిపించాయి.. చట్టానికి తలొగ్గడం లేదా ఆస్ట్రేలియాలో మా వార్తా సేవలను నిలిపివేయటం. మేము బరువెక్కిన హృదయంతో ఆ రెండో దాన్నే ఎంచుకున్నాము’’  అంటూ ఫేస్‌బుక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన బ్లాగర్లు, ప్రచురణకర్తలు తమ యాప్‌లో వార్తలను ప్రచురించవచ్చని.. ఐతే ఆ పోస్టులు, లింకులు అందుబాటులో ఉండవని సంస్థ రీజనల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ విలియం ఈస్టన్‌ తెలిపారు. అదేవిధంగా ఆస్ట్రేలియా వార్తలను ఇతర బయటి దేశాల ప్రజలతో కూడా షేర్‌ చేయలేదని ఆయన వివరించారు.

కాగా, ఫేస్‌బుక్‌ ప్రత్యర్థి సంస్థ గూగుల్‌ కూడా ఆసీస్‌ ప్రభుత్వ నూతన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐతే ఫేస్‌బుక్‌ మాదిరిగా కాకుండా.. గూగుల్‌ కార్యకలాపాల్లో వార్తా సేవలు ప్రధాన భాగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూస్‌ షోకేస్‌ విధానంలో వార్తలను అందించేందుకు గూగుల్‌, స్థానిక మీడియా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది.  

కాగా, ఫేస్‌బుక్‌ నిర్ణయం ఆ సంస్థనే దెబ్బ తీస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వ సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ రెస్పాన్సిబుల్‌ టెక్నాలజీ’  డైరెక్టర్‌ పీటర్‌ లూయిస్‌ ప్రకటించారు. సామాజిక మాధ్యమ ప్రత్యర్థులతో పోలిస్తే దేశంలో ఫేస్‌బుక్‌ బలహీనమై పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి

ఇస్రో, ఆస్ట్రేలియన్‌ సంస్థల కీలక ఒప్పందం

బ్రిటన్‌ రాణి భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌కు అస్వస్థత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని