వినియోగదారులకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు!

వినియోగదారులకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు షాక్‌ ఇవ్వనున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ధరలు పెంచేందుకు ఆయా కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

Updated : 20 Mar 2022 18:43 IST

దిల్లీ: వినియోగదారులకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు షాక్‌ ఇవ్వనున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ధరలు పెంచేందుకు ఆయా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గోధుమలు, పామాయిల్‌, ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ ధరలు పెరగడంతో పెంపు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. దీంతో సామాన్యులకు నిత్యావసరాల కొనుగోలు ఇకపై మరింత భారం కానుంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ముడి సరకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయాలు ధరల సవరణ వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. ఇప్పటికే హెచ్‌యూఎల్‌, నెస్లే కంపెనీలు గత వారం ధరలు పెంచగా.. డాబర్‌, పార్లే కంపెనీలు పరిస్థితులను సమీక్షించి తదనుగుణంగా పెంచాలని చూస్తున్నాయి.

ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు 10 -15 శాతం వరకు పెరిగే అవకాశం ఉండొచ్చని పార్లే ప్రొడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షా పీటీఐకి తెలిపారు. పామాయిల్‌ ధర ఇటీవల లీటర్‌ రూ.180 దాకా వెళ్లిందని, మళ్లీ ఇప్పుడు రూ.150కి తగ్గిందన్నారు. క్రూడాయిల్‌ సైతం ఒక దశలో బ్యారెల్‌ 140 డాలర్లు ఉండగా.. ఇప్పుడు 100 డాలర్లకు చేరిందని పేర్కొన్నారు. వీటి ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయన్నారు. అయినప్పటికీ గతం కంటే అధికంగా ఉన్నాయని చెప్పారు. అయితే, కొవిడ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచేందుకు కంపెనీలు వెనుకాడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతానికైతే పార్లే కంపెనీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఓ నెల ఆగిన తర్వాత పెంపు గురించి ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. డాబర్‌ ఇండియా సైతం దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వల్ల ధరలు పెంచేందుకు ఆలోచన చేస్తున్నా.. ప్రస్తుతానికైతే పరిస్థితులను సమీక్షిస్తున్నామని డాబర్‌ ఇండియా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అనుష్క జైన్‌ తెలిపారు.

కాఫీ, ప్యాకేజింగ్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3 నుంచి 5 శాతం మేర అన్ని కంపెనీలూ ధరలు పెంచే అవకాశం ఉంటుందని ఎడిల్‌విస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభినీశ్‌ రాయ్‌ పేర్కొన్నారు. మరోవైపు హెచ్‌యూఎల్‌ కంఎనీ బ్రూ కాఫీ, బ్రూక్‌ బాండ్‌ టీ ధరలను పెంచిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. నెస్లే ఇండియా సైతం మ్యాగీ ఇండియా ధరలను 9 నుంచి 16 శాతం మేర పెంచింది. పాల పొడి, కాఫీ  పొడి ధరలను కూడా సవరించింది. ధరల పెంపుపై హెచ్‌యూఎల్‌ ప్రతినిధి స్పందిస్తూ తమ బిజినెస్‌ మోడల్‌ను కాపాడుకుంటూనే వినియోగదారులకు తగిన విలువను అందిస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని