FPI: 3 రోజుల్లో దేశం దాటిన ₹4500 కోట్లు!

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపును వేగంగా చేపట్టనున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు అప్రమత్తమయ్యారు....

Published : 17 Apr 2022 15:39 IST

ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు సంకేతాలతో ఎఫ్‌పీఐల నిష్క్రమణ

దిల్లీ: అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపును వేగంగా చేపట్టనుందన్న సంకేతాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) అప్రమత్తమయ్యారు. గతవారం భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.4,500 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను విక్రయించి నికర విక్రేతలుగా నిలిచారు. రెండు రోజుల వరుస సెలవుల కారణంగా మార్కెట్లు కేవలం గతవారంలో మూడు రోజులు మాత్రమే పనిచేశాయి. అదే ఏప్రిల్‌ 8వ తేదీతో ముగిసిన వారంలో మార్కెట్లలో వచ్చిన దిద్దుబాటును అవకాశంగా మలచుకొని రూ.7,707 కోట్లు విలువ చేసే షేర్లు కొని నికర కొనుగోలుదారులుగా నిలవడం గమనార్హం.

అంతకంటే ముందు వరుసగా దాదాపు ఆరు నెలల పాటు ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఆ వ్యవధిలో దాదాపు రూ.1.48 లక్షల కోట్ల పెట్టుబడులను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఫలితంగా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు మదుపర్లను ప్రభావితం చేశాయి.

ఉక్రెయిన్‌-రష్యా వివాదం సద్దుమణిగితే.. ఎఫ్‌పీఐలు తిరిగి భారత్‌కు భారీ ఎత్తున తరలివస్తారని రైట్‌ రీసెర్చి వ్యవస్థాపకుడు సోనమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్‌ సంకేతాలు, భారత్‌లో అంచనాలను మించిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఎఫ్‌పీఐల సెంటిమెంటును దెబ్బతీశాయని వివరించారు. ఈక్విటీ మార్కెట్లతో పాటు డెట్‌ మార్కెట్ల నుంచి కూడా గతవారం ఎఫ్‌పీఐలు రూ.415 కోట్లు విలువ చేసే పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు క్రితం వారం రూ.1,403 కోట్ల నిధులను మదుపు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని