
Future Group: మరో న్యాయపోరాటంలోఫ్యూచర్ గ్రూప్!
ఎగవేతదారుగా ప్రకటించొద్దని విజ్ఞప్తి
దిల్లీ: తమ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలను సవాల్ చేస్తూ కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గడువులోగా రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు తమని ఎగవేతదారుగా ప్రకటించడాన్ని నిలువరించాలని కోరింది. అమెజాన్‌తో న్యాయపోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో తమ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
తమ రిటైల్ విభాగాన్ని రిలయన్స్‌కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో అమెజాన్‌తో చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో విక్రయం నిలిచిపోయింది. ఫలితంగా బాకీలను ఫ్యూచర్ సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో రుణదాతలు విధించిన కొన్ని నిబంధనలు ఉల్లఘించినట్లైంది. కానీ, ఫ్యూచర్ మాత్రం తమవైపు ఎటువంటి తప్పు జరగలేదని వాదిస్తోంది.
డిసెంబరు 31 నాటికి చెల్లించాల్సిన రూ.3,500 కోట్ల బకాయిల విషయంలో తాము విఫలమయ్యామని ఈనెల ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫ్యూచర్ గ్రూప్ అంగీకరించింది. అమెజాన్‌తో తలెత్తిన వివాదం కారణంగా తాము కొన్ని విక్రయ ఒప్పందాలు అమలు చేయలేకపోయినట్లు తెలిపింది. అందుకే చెల్లింపులు సకాలంలో చేయలేకపోయామని వివరించింది. 30 రోజుల ‘గ్రేస్ పీరియడ్’లో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించామని తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో తమకు మరికొంత సమయమిచ్చేలా రుణదాతలతో పాటు రిజర్వు బ్యాంకును ఆదేశించాలని ఫ్యూచర్ గ్రూప్ కోర్టును కోరింది. అలాగే ఎస్‌బీఐ సహా ఇతర సంస్థల నుంచి తమకు అందిన ఎగవేత నోటీసులను సైతం కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది.