వచ్చే దశాబ్దంలో 11% వృద్ధి సాధ్యమే

వచ్చే దశాబ్దంలో భారత్‌ 11 శాతం వృద్ధిని సాధించగలదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర అంటున్నారు. అయితే తనకున్న మానవ వనరుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని; తయారీ, ఎగుమతులకు గట్టి ఊతమిస్తే ఇది సాధ్యమని శనివారం భువనేశ్వర్‌లో జరిగిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’

Published : 14 Aug 2022 03:05 IST

తయారీ, ఎగుమతులకు ఊతమివ్వాలి

అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి మారాలి

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర

దిల్లీ: వచ్చే దశాబ్దంలో భారత్‌ 11 శాతం వృద్ధిని సాధించగలదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర అంటున్నారు. అయితే తనకున్న మానవ వనరుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని; తయారీ, ఎగుమతులకు గట్టి ఊతమిస్తే ఇది సాధ్యమని శనివారం భువనేశ్వర్‌లో జరిగిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో పేర్కొన్నారు. ‘భారత్‌ తన అవకాశాలను అందిపుచ్చుకుని, సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. 11 శాతం వృద్ధిని నమోదు చేస్తే మాత్రం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి 2048 వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. 2031 కల్లా సాధ్యం చేయవచ్చు. 138 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే యువకులు ఎక్కువగా ఉన్న దేశంగా భారత్‌ ఉంది. 2023 కల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా (143 కోట్ల మంది) గల దేశం మారుతుంద’ని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
పనిచేసే వయసున్న జనాభా ఎక్కువ ఇక్కడే..: పనిచేసే వయసు ఉన్న జనాభా(డబ్ల్యూఏపీ) నిష్పత్తి విషయంలో చైనా, బ్రెజిల్‌, అమెరికా, జపాన్‌లతో పోలిస్తే భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటికే ఆయా దేశాల్లో పనిచేసే వయసున్న జనాభా తగ్గుతోంది. అదే భారత్‌ విషయానికొస్తే డబ్ల్యూఏపీ నిష్పత్తి 2045 వరకు పెరుగుతుంది. ఈ విషయంలో 2030కల్లా చైనాను సైతం అధిగమిస్తుంది. పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉండడం భారత్‌కు అవకాశంలాంటిది. అదే సమయంలో అది సవాలునూ విసరవచ్చు.

4.0ను అందిపుచ్చుకోవాలి: ఎగుమతులను పెంచాలంటే తయారీలో మంచి వృద్ధి అవసరం. ఇందుకోసం తయారీ రంగం.. ఆటోమేషన్‌, డేటా ఎక్స్ఛేంజ్‌, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కాగ్నిటివ్‌ కంప్యూటింగ్‌, ద స్మార్ట్‌ ఫ్యాక్టరీ, అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్స్‌ వంటి నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి. తర్వాత మానవ వనరులపై పెట్టుబడులను పెంచడం ద్వారా నైపుణ్య సిబ్బంది సంఖ్యను కచ్చితంగా పెంచాలి. అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మారాలంటే జీడీపీలో తయారీ వాటాను కనీసం 25 శాతానికి చేర్చాలి. 2030 కల్లా భారత్‌ నిర్దేశించుకున్న 1 లక్ష కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటే ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటా 5 శాతానికి చేరుతుంది. అపుడు ఎగుమతి శక్తిగా మారగలదు.

రూపాయి సత్తా చాటాలి: విదేశాల్లో ఉండే వారి విషయంలో ప్రపంచంలోనే భారతీయులు తొలి స్థానంలో ఉంటారు. అందుకే భారత్‌కు విదేశాల నుంచి వచ్చే డబ్బులు ఎక్కువగా ఉంటాయి. భారత రూపాయి బయటే మూడింతల ట్రేడింగ్‌ అవుతుంటుంది. అంతర్జాతీయ ఫారెక్స్‌ టర్నోవరులో భారత రూపాయి టర్నోవరు అమెరికాయేతర, యూరోయేతర కరెన్సీ స్థాయి(4%)కి చేరుకుంటే అపుడు అంతర్జాతీయ కరెన్సీగా మారుతుంది.

సవాళ్లు సైతం..: పలు సవాళ్లు కూడా మనకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా కోల్పోయిన జీవన ప్రమాణాలను అందుకోవడానికి కొన్నేళ్లు పట్టవచ్చు. అలాగే మౌలిక వసతుల్లో పెట్టుబడులను కూడా పెంచాల్సి ఉంది. అత్యున్నత నైపుణ్యం ఉన్న కార్మిక సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని