బ్యాంకుల ప్రైవేటీకరణ దూకుడుగా చేపడితే ముప్పే

ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ప్రైవేటీకరించే విషయంలో దూకుడుగా వెళ్తే మంచి కంటే చెడు జరిగేందుకే అధిక అవకాశాలు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వ్యాసం హెచ్చరించింది.

Published : 19 Aug 2022 03:19 IST

ఆర్‌బీఐ వ్యాసం 

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ప్రైవేటీకరించే విషయంలో దూకుడుగా వెళ్తే మంచి కంటే చెడు జరిగేందుకే అధిక అవకాశాలు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వ్యాసం హెచ్చరించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని తెలిపింది. లాభదాయకతను పెంచడంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకులు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. అందరికీ బ్యాంకింగ్‌ సేవలను చేరువ చేసే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే వాటి కంటే ముందున్నాయని పేర్కొంది. ‘అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే మందు అనుకుంటుంటారు. అయితే దీనిని అమల్లోకి తేవాలంటే మరింత నిశితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంద’ని ఆర్‌బీఐ వ్యాసం వివరించింది. లాభదాయకతను పెంచుకోవడం ఒక్కటే ప్రభుత్వ రంగ బ్యాంకుల లక్ష్యం కాదని, అందరికీ బ్యాంకింగ్‌ సేవల కల్పన లక్ష్యాన్ని ఇవి సాధిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వివరించింది. బలహీన బ్యాలెన్స్‌ షీట్‌లను కలిగి ఉన్నాయనే విమర్శలు ఎలా ఉన్నప్పటికీ.. ఇటీవల  ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) మార్కెట్లో గట్టి నమ్మకాన్ని సాధించాయని తెలిపింది. కొవిడ్‌-19 పరిణామాల కుదుపు నుంచి విశేష రీతిలో ఇవి తట్టుకుని నిలబడ్డాయని గుర్తు చేసింది. పీఎస్‌బీల మెగా విలీనంతో బ్యాంకింగ్‌ రంగంలో స్థిరీకరణ రావడంతో పాటు బలమైన, పోటీ సామర్థ్యంతో కూడిన బ్యాంకుల సృష్టి జరిగిందని పేర్కొంది. బ్యాలెన్స్‌ షీట్‌ల నుంచి మొండి బకాయిల భారాన్ని తొలగించేందుకు నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) తోడ్పడుతుందని ఆర్‌బీఐ వ్యాసం వివరించింది. ఈ సంస్కరణలన్నీ పీఎస్‌బీల బలోపేతానికి ఉపయోగపడతాయని తెలిపింది. ఈ వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయితవని, వీటితో తమకు సంబంధం లేదని ఆర్‌బీఐ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని