సంక్షిప్త వార్తలు (13)

ప్రఖ్యాత హోటళ్లు, ఆతిథ్య రంగ ప్రముఖులు ముందుకొచ్చి దేశంలోని కనీసం ఒక్కో చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. భారత పురాతత్వ విభాగం పరిధిలో ఉన్న  3600కి పైగా ప్రాచీన వారసత్వ కట్టడాలను దత్తత తీసుకుని,

Updated : 30 Sep 2022 03:15 IST

చారిత్రక కట్టడాలను దత్తత తీసుకోండి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

ఈనాడు, దిల్లీ: ప్రఖ్యాత హోటళ్లు, ఆతిథ్య రంగ ప్రముఖులు ముందుకొచ్చి దేశంలోని కనీసం ఒక్కో చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. భారత పురాతత్వ విభాగం పరిధిలో ఉన్న  3600కి పైగా ప్రాచీన వారసత్వ కట్టడాలను దత్తత తీసుకుని, అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. దీనివల్ల ఆయా హోటళ్లకు ప్రచారం కూడా లభిస్తుందన్నారు. గురువారం ఇక్కడ జరిగిన అఖిల భారత హోటల్‌ యజమానుల సంఘం 5వ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘పర్యాటకంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు త్వరలోనే భారత పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో ఏయే అంశాలపై చర్చించాలో సూచనలివ్వండి. జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నాం. పర్యాటక క్షేత్రాలకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు వివిధ మంత్రిత్వ శాఖలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. చాలా సెక్టార్లలో పనులు వేగవంతమయ్యాయి’’ అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.


గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 6 స్థానాలు మెరుగైన భారత్‌  

దిల్లీ: పలు అంశాల్లో రాణించడంతో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2022లో ఆరు స్థానాలు మెరుగు పరచుకుని మనదేశం 40వ ర్యాంకు సాధించింది. జెనీవాకు చెందిన వరల్డ్‌ ఇంలెక్చువల్‌ ప్రోపర్టీ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూపీఐఓ) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. స్విట్జర్లాండ్‌, అమెరికా, స్వీడన్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ ప్రపంచంలోనే అత్యంత వినూత్నత గల ఆర్థిక వ్యవస్థలుగా నిలిచినట్లు ఆ నివేదిక తెలిపింది. అగ్రశ్రేణి -10 దేశాల్లో చైనా కూడా ఉంది. వర్థమాన దేశాలు బలమైన పనితీరును స్థిరంగా కొనసాగిస్తున్నాయని.. ముఖ్యంగా భారత్‌(40), టర్కీ(37) తొలిసారిగా టాప్‌-40లోకి చేరాయని ఆ నివేదిక చెబుతోంది. కెనడా తిరిగి టాప్‌-15లోకి చేరిందని వివరించింది.తాజా పరిణామంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ‘వినూత్నత విషయంలో మరింత ప్రగతి సాధించడానికి దేశం సిద్ధంగా ఉంది. మా వినూత్న రూపకర్తలను చూసి గర్విస్తున్నాం. మరింత ఎత్తుకు చేరాలని భావిస్తున్నామ’ని ట్వీట్‌ చేశారు. ఏడేళ్లలో 41 స్థానాలను మెరుగుపరచుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయెల్‌ పేర్కొన్నారు. 2015లో 81వ స్థానంలో; 2021లో 46వ స్థానంలో భారత్‌ ఉంది. ఇన్‌స్టిట్యూషన్లు, మానవ వనరులు-పరిశోధన, మౌలిక వసతులు, మార్కెట్‌ ఆధునికీకరణ, వ్యాపార నవీకరణ, పరిజ్ఞానం, సాంకేతిక ఉత్పత్తులు, ఉత్పత్తుల సృష్టి వంటి పలు అంశాల ఆధారంగా ఈ సూచీని లెక్కించారు.  


భారత విమానాశ్రయాలు ‘స్థిరం’: ఇక్రా

భారత విమానాశ్రయ మౌలిక వసతుల భవిష్యత్‌ అంచనాను ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరత్వం’కు మారుస్తున్నట్లు క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ‘ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వచ్చే ఏడాది ఆగస్టు మధ్య ప్రయాణికుల రద్దీ కరోనాకు ముందు స్థాయికి చేరొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనే దేశీయ ప్రయాణికుల రద్దీ ఆ స్థాయికి చేరొచ్చు. అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ మాత్రం 2023-24 రెండో త్రైమాసికంలో పూర్తిగా రికవరీ సాధించొచ్చ’ని అంచనా వేసింది. దేశీయ రద్దీలో రికవరీ బలంగా కనిపిస్తోంది. కరోనా ముందు స్థాయిల్లో 97-98 శాతం 2022-23లోనే పుంజుకుంటుందని పేర్కొంది. మొత్తం మీద ప్రయాణికుల రద్దీ 71-73 శాతం మేర వృద్ధి చెంది 32.4-32.7 కోట్ల(కరోనా ముందు స్థాయిలో 95-96%)కు చేరొచ్చు.


మహిళా పారిశ్రామికవేత్తలకు  యూబీఐ రూ.1,000 కోట్ల రుణాలు  

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా పారిశ్రామికవేత్తలకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.1,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ‘యూనియన్‌ నారి శక్తి’ పథకం కింద గత నెల రోజులుగా ప్రత్యేక రుణాల జారీ కార్యక్రమాన్ని చేపట్టి, దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చినట్లు యూబీఐ వెల్లడించింది. ఈ పథకం కింద రూ.2 - 10 కోట్ల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. మహిళలకు అండగా నిలవడంలో తమ బ్యాంకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని యూబీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సి.ఎం.మినోఛ వివరించారు.


అంతర్జాతీయ వృద్ధి చోదకంగా భారత్‌  

కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌

కోల్‌కతా: అంతర్జాతీయ వృద్ధి పునరుత్తేజానికి భారత్‌ కీలకం కానుందని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. భారత్‌ స్థిరమైన వృద్ధి సాధిస్తోందని, ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలిచిందని తెలిపారు. బెంగాల్‌ చాంబర్స్‌ వార్షిక సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి, దృశ్యమాధ్యమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో మూడో స్థానానికి చేరనున్నాం. 2047లో 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలని ప్రధాన మంత్రి మోదీ లక్ష్యం పెట్టుకున్నారు’ అని గోయల్‌ తెలిపారు.  2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల ఎగుమతులను సాధించాలని ఆకాంక్షించారు.


చిన్న పాటి సబ్సిడీలపై ఆధారపడొద్దు

పరిశ్రమతో గోయెల్‌

దిల్లీ: ఎగుమతులు పెంచుకోడానికి చిన్నపాటి ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై ఆధారపడొద్దని.. దాని బదులుగా పోటీని పెంచుకోవాలని సేవల ఎగుమతిదార్లకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయెల్‌ సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకోవడం కోసం తమ పోటీతత్వాన్ని బలోపేతం చేసుకోవాలని గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పరిశ్రమకు ఆయన సూచించారు. ‘సర్వీస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రం ఇండియా స్కీమ్‌(ఎస్‌ఈఐఎస్‌)ను కొనసాగించాలంటూ పరిశ్రమ చేసిన విజ్ఞప్తిపై ఆయన పై విధంగా స్పందించారు. ‘రికార్డులు పరిశీలిస్తే.. ఎస్‌ఈఐఎస్‌ ఉన్న సమయంలో మీ ఎగుమతులు పెద్దగా పెరగలేదు. చాలా సాధారణ వృద్ధి రేటే కనిపించింది. అన్ని సబ్సిడీలను క్రమంగా తొలగిస్తున్నట్లు మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ఇవి మనల్ని పోటీలో నిలవకుండా చేస్తాయి. అది మనల్ని వెనక్కి నెడతాయి. ఐటీ రంగం ఎపుడూ ఏ సబ్సిడీనీ అడగలేదు. అయినా మంచి వృద్ధిని నమోదు చేస్తోంది. మాకు ఓ రెండ్రూపాయలు ఇవ్వండి. ఎగుమతులు పెంచి చూపిస్తామనే ధోరణి నుంచి బయటకు రండి. ప్రభుత్వం పై ఆధారపడవద్ద’ని సూచించారు.


ఇండిగో చేతికి సరకు రవాణా విమానం

ముంబయి: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మొదటి సరకు రవాణా (ఫ్రైటర్‌) విమానాన్ని అందుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల విమానాన్ని కంపెనీ సరకు రవాణా విమానం మార్చింది. కొత్త ఏ321 పీ2ఎఫ్‌ విమానంతో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో సరకు రవాణా సేవలు అందించనున్నట్లు ఇండిగో తెలిపింది. చైనా, గల్ఫ్‌, సీఐఎస్‌ దేశాలకు సేవలందించే సౌలభ్యం వచ్చినట్లు వెల్లడించింది. దేశీయ ప్రయాణికుల విభాగంలో ఇండిగో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. కంపెనీ చేతిలో 275కు పైగా విమానాలు ఉన్నాయి. 74 దేశీయ గమ్యస్థానాలకు రోజూ 1600 విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా 26 గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది.


వర్థమాన దేశాల్లో భారత్‌ ఒక ‘స్టార్‌’: ఎస్‌&పీ

దిల్లీ: పెరుగుతున్న కీలక రేట్లకు తోడు ఐరోపాలో ఇంధన అభద్రత, ప్రతి దేశ వృద్ధిపై ప్రభావం చూపిస్తోంది. అయితే భారత్‌ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చు. వర్థమాన దేశాల్లో భారత్‌ ఒక ‘స్టార్‌’గా నిలుస్తుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. ‘కొన్ని త్రైమాసికాల పాటు అంతర్జాతీయ స్థూల పనితీరు మందగమనం పాలు కావొచ్చు. కేంద్ర బ్యాంకులు పెంచిన వడ్డీ రేట్ల వల్ల ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం ఇందుకు నేపథ్యమ’ని ఎస్‌ అండ్‌ పీ వెల్లడించింది. చాలా వరకు ప్రధాన, సెంటిమెంటు సంకేతాలన్నీ వృద్ధి నెమ్మదించవచ్చనే చెబుతున్నాయని అంటోంది. ‘రెండో త్రైమాసికంలో వర్థమాన దేశాల్లో వృద్ధి కాస్త మందగించింది. చైనా మినహా 16 వర్థమాన దేశాల్లో ఈ ఏడాది జీడీపీ వృద్ధి 5.2 శాతంగా నమోదు కావొచ్చు. అయితే భారత్‌ మాత్రం 7.3 శాతం వృద్ధితో ఒక ‘స్టార్‌’గా వెలగవచ్చ’ని అంచనా వేసింది. ‘అమెరికాలో కాస్తంత మాంద్యం ఛాయలు కనిపిస్తాయని మేం అంచనా వేస్తున్నాం. కరోనా అనంతర పరిణామాల వల్ల ప్రతి చోటా వృద్ధిపై ప్రభావం పడుతోంది. అంచనాకు తగ్గట్లుగా కనిపిస్తున్న మందగమనం బహుశా ఇదే కావొచ్చ’ని పేర్కొంది.


ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌, ఐడీబీఐ ఎంఎఫ్‌ విలీనం తుది దశలో

ముంబయి: ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌), ఐడీబీఐ ఎంఎఫ్‌ విలీనం తుదిదశలో ఉన్నట్లు ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టీఎస్‌ రామకృష్ణన్‌ పేర్కొన్నారు. రెండు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో ఒకే ప్రమోటర్‌కు 10 శాతానికి మించి వాటా ఉండరాదన్న నిబంధనల వల్లే ఐడీబీఐ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ విలీనం చేసుకుంటోంది. ఐడీబీఐ ఎంఎఫ్‌ మాతృసంస్థ అయిన ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి మెజారిటీ వాటా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో 22వ అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ అయిన ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ నిర్వహణలోని ఆస్తులు రూ.18,000 కోట్లకు పైగా ఉన్నాయని, ఐడీబీఐ ఎంఎఫ్‌ విలీన ప్రక్రియ సమాచారాన్ని అందరికీ తెలియజేస్తామని రామకృష్ణన్‌ తెలిపారు. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి 10 ఫండ్‌ సంస్థల్లోకి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రస్తుతం 12-13 శాతంగా ఉన్న ఈక్విటీ పెట్టుబడులను, 2023-24కు పరిశ్రమ సగటు అయిన 45 శాతానికి పెంచుతామని వివరించారు. ఐడీబీఐ మ్యూచువల్‌ ఫండ్‌ విక్రయానికి రెండుసార్లు ప్రయత్నాలు జరగ్గా సఫలం కాలేదని, దీంతో ఎల్‌ఐసీ ఎంఎఫ్‌లో విలీనం దిశగా అడుగులు పడ్డాయని సంబంధిత వర్గాల సమాచారం.


వయోవృద్ధులు, విద్యార్థుల రాయితీల్లో ఎయిరిండియా కోత

ముంబయి: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా తన విమానాల్లో ఎకానమీ క్లాసుపై ఎంపిక చేసిన బుకింగ్‌లలో వయోవృద్ధులు, విద్యార్థులకు అందిస్తున్న రాయితీలను సగానికి తగ్గించింది. కనీస ఛార్జీలపై సవరించిన రాయితీలు సెప్టెంబరు 29 నుంచి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ‘సెప్టెంబరు 29, ఆ తరవాత ఎకానమీ క్లాసులో జరిపే బుకింగ్‌లపై వయోవృద్ధులు/విద్యార్థులకు 25 శాతం రాయితీ (బేస్‌ ఫేర్‌పై) అమలు అవుతుంద’ని సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇప్పటివరకు వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది. రాయితీ తగ్గించినప్పటికీ.. ఇతర విమాన కంపెనీలతో పోలిస్తే, దాదాపు రెట్టింపునకు సమానమ’ని ఎయిరిండియా పేర్కొంది. మొత్తం మార్కెట్‌ పరిస్థితులు, ధోరణులను పరిగణించి.. పరిశ్రమకు అనుగుణంగానే మా ఛార్జీలనూ హేతుబద్ధీకరించాలని నిర్ణయించామ’ని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.


జీడీపీలో 2.8 శాతానికి కరెంట్‌ ఖాతా లోటు: ఆర్‌బీఐ

ముంబయి: దేశ కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.8 శాతానికి (23.9 బిలియన్‌ డాలర్లు) చేరిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. అధిక వాణిజ్య లోటు వల్ల సీఏడీ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో సీఏడీ 13.4 బి.డాలర్లుగా (జీడీపీలో 1.5%) నమోదైంది. 2021-22 ఏప్రిల్‌-జూన్‌లో కరెంట్‌ ఖాతా 6.6 బి.డాలర్ల మిగుల్లో ఉంది. 2022 జనవరి-మార్చిలో 54.5  బి.డాలర్ల వాణిజ్య లోటు ఉండగా, ఏప్రిల్‌-జూన్‌లో అది   68.6 బి.డాలర్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది.


మెటావర్స్‌పై షేమారు సినిమా థియేటర్‌

మంబయి: మెటావర్స్‌ ప్లాట్‌ఫామ్‌పై సినిమా థియేటర్‌ను అందించనున్న తొలి దేశీయ సంస్థగా ప్రముఖ వినోద సంస్థ షేమారు ఎంటర్‌టైన్‌మెంట్‌ నిలిచింది. అక్టోబరు 7 నుంచి ప్రతి శుక్రవారం ఒక బాలీవుడ్‌ సినిమాను సంస్థ అందించనుంది. మెటావర్స్‌ కన్సల్టింగ్‌, అభివృద్ధి కంపెనీ డీసెంట్రాల్యాండ్‌పై ఈ సేవలు లభిస్తాయని, ఇందుకోసం ఫిల్మ్‌రేర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు షేమారు తెలిపింది. మెటావర్స్‌పై షేమారు థియేటర్‌తో వర్చువల్‌ ప్రేక్షకులకు ప్లష్‌ లాబీ, బాక్సాఫీస్‌ కౌంటర్‌, వర్చువల్‌ ట్రైలర్‌ జోన్‌లు, పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్‌లు సహా సరికొత్త స్క్రీనింగ్‌ అనుభూతి లభిస్తుందని వెల్లడించింది. ప్రారంభంలో వినియోగదార్లకు ఈ సేవలు ఉచితమని షేమారు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ హిరేన్‌ గదా అన్నారు. మెటావర్స్‌ కార్యక్రమంతో బాలీవుడ్‌ చిత్రాలను మరింతగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని షేమారు భావిస్తోంది. సంస్థ చేతిలో గోల్‌మాల్‌- ఫన్‌ అన్‌లిమిటెడ్‌, అమర్‌ అక్బర్‌ ఆంధోనీ, జబ్‌ వి మెట్‌, డిస్కో డ్యాన్సర్‌ వంటి చిత్రాలు ఉన్నాయి. వర్చువల్‌ సామాజిక మాధ్యమం అయిన డీసెంట్రాల్యాండ్‌ ఎథేరియం బ్లాక్‌చెయిన్‌తో పనిచేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులు కంటెంట్‌ సృష్టించడం, వీక్షించడం, విక్రయాలు వంటివి చేయొచ్చు.


యూకేకు మలేరియా వ్యాక్సిన్‌

సీరమ్‌ సంస్థకు డీసీజీఐ అనుమతి

దిల్లీ: మనదేశం నుంచీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)కు మలేరియా వ్యాక్సిన్‌ 2 లక్షల డోసుల్లో ఎగుమతి కానుంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిను భారత్‌లో   సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రమాణాలతో ఉత్పత్తి చేసింది. ఇప్పుడీ వ్యాక్సిన్‌ను  యూకేకు ఎగుమతి చేసేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ నెల 27న వ్యాక్సిన్‌ ఎగుమతికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐకి దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన డీసీజీఐ అనుమతి మంజూరు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ డాక్టర్‌ అదర్‌ సి పునావాలా నేతృత్వంలో మలేరియా వ్యాక్సిన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తి చేస్తున్నామ’ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జీఎస్‌కే ఉత్పత్తి చేస్తున్న మలేరియా వ్యాక్సిన్‌ ఒక్కటే అంతర్జాతీయంగా అందుబాటులో ఉంది. 

* ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని జెన్నెర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎస్‌ఐఐతో కలిసి 2020లో మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. 409 మంది చిన్నారులపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించగా, 80 శాతం రక్షణ లభించిందని తెలుస్తోంది. 3 ప్రారంభ డోసులతో పాటు ఒక బూస్టర్‌ డోసుతో ఇది సాధ్యమైందని సమాచారం. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో అడ్వాన్స్‌డ్‌ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని