వాహనాలకు పండగ జోష్‌

దేశంలో వాహన విక్రయాలతో పాటు జీఎస్‌టీ వసూళ్లలోనూ పండగ జోష్‌ కనిపిస్తోంది. పండగల నేపథ్యంలో కొనుగోలుదార్ల నుంచి గిరాకీ అధికంగా లభిస్తుందనే అంచనాలతో, సెప్టెంబరులో వాహన కంపెనీలకు డీలర్లు అధికంగా ఆర్డర్లు ఇచ్చారు. చిప్‌ కొరత తీరినందున కంపెనీలు కూడా పెద్దమొత్తంలో సరఫరా చేయగలిగాయి.

Published : 02 Oct 2022 02:15 IST

త్రైమాసికంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 10 లక్షలు

దేశంలో వాహన విక్రయాలతో పాటు జీఎస్‌టీ వసూళ్లలోనూ పండగ జోష్‌ కనిపిస్తోంది. పండగల నేపథ్యంలో కొనుగోలుదార్ల నుంచి గిరాకీ అధికంగా లభిస్తుందనే అంచనాలతో, సెప్టెంబరులో వాహన కంపెనీలకు డీలర్లు అధికంగా ఆర్డర్లు ఇచ్చారు. చిప్‌ కొరత తీరినందున కంపెనీలు కూడా పెద్దమొత్తంలో సరఫరా చేయగలిగాయి. ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నందునే, గత నెలలో జీఎస్‌టీ వసూళ్లు కూడా రూ.1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

దిల్లీ: సెప్టెంబరులో వాహన కంపెనీల టోకు విక్రయాలు (డీలర్లకు సరఫరాలు) గణనీయంగా పెరిగినట్లు కంపెనీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంపెనీలన్నీ సరఫరా చేసిన ప్రయాణికుల వాహనాల (పీవీ) సంఖ్య 3,55,946కు చేరింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య 91 శాతం అధికం. ఫలితంగా జులై-సెప్టెంబరులో పీవీల అమ్మకాలు 10 లక్షల మైలురాయిని మించాయి. ఈ త్రైమాసికంలో పీవీల అమ్మకాలు ఈస్థాయిలో జరగడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌-సెప్టెంబరులో మొత్తం 19.37 లక్షల పీవీలు అమ్ముడయ్యాయి. ఇంత భారీ అమ్మకాలు జరగడమూ ఇదే తొలిసారి.

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మొత్తం 1,76,306 కార్లను సరఫరా చేసింది. 2021 సెప్టెంబరులో సరఫరా చేసిన 86,380 వాహనాలతో పోలిస్తే ఇది రెట్టింపుకంటే అధికం. టాటా మోటార్స్‌ దేశీయ సరఫరాలు 44 శాతం, హ్యుందాయ్‌ 38 శాతం, టయోటా కిర్లోస్కర్‌ 66 శాతం పెరిగినట్లు తెలిపాయి. ద్విచక్ర వాహనాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ టోకు విక్రయాలు రెట్టింపునకు మించితే, హీరో మోటాకార్ప్‌ మొత్తం అమ్మకాలు 1.95 శాతం తగ్గినా, దేశీయ విక్రయాలు స్వల్పంగా పెరిగాయి.

మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు ఏడాది వ్యవధిలో 68,815 వాహనాల నుంచి రెట్టింపునకు మించి 1,54,903కు చేరాయి. ఇందులో ప్రయాణికుల వాహనాలే 63,111 నుంచి 1,48,380కు చేరాయి. ఆల్టో, ఎస్‌-ప్రెసో వంటి చిన్న కార్ల విభాగ అమ్మకాలు 14,936 నుంచి రెట్టింపునకు మించి 29,574కు; స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్‌ వంటి మోడళ్లతో కూడిన మధ్యశ్రేణి విభాగ అమ్మకాలు 20,891 నుంచి మూడింతలకు మించి 72,176కు చేరాయి. విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్, ఎర్టిగాలతో కూడిన వినియోగ వాహన విభాగ అమ్మకాలు 18,459 నుంచి 32,574కు చేరాయి. ఎగుమతులు కూడా 17,565 నుంచి 21,403కు పెరిగాయి.

42 శాతానికి ఎంఎస్‌ఐ వాటా: గత 42 నెలల్లో ఈ సెప్టెంబరు తమకు రెండో అత్యుత్తమమని ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. 2020 అక్టోబరులో దేశీయంగా 1.63 లక్షల పీవీల సరఫరా చేశామని వివరించారు. తమ మార్కెట్‌ వాటా ఏడాది క్రితంతో పోలిస్తే 7.8 శాతం పెరిగి 42 శాతానికి చేరినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని