అక్షతా మూర్తికి ఇన్ఫీ నుంచి రూ.126.61 కోట్లు

బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్‌ భార్య అక్షతా మూర్తి.. 2022లో ఇన్ఫోసిస్‌ నుంచి రూ.126.61 కోట్ల డివిడెండు ఆదాయాన్ని ఆర్జించారు.

Published : 26 Oct 2022 02:59 IST

2022లో డివిడెండు రూపేణా ఆదాయం

దిల్లీ: బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్‌ భార్య అక్షతా మూర్తి.. 2022లో ఇన్ఫోసిస్‌ నుంచి రూ.126.61 కోట్ల డివిడెండు ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతకు సెప్టెంబరు చివరినాటికి కంపెనీలో 0.93% వాటా లేదా 3.89 కోట్ల షేర్లున్నాయి. బీఎస్‌ఈలో మంగళవారం ముగింపు ధర (రూ.1,525.75) ప్రకారం.. ఆమె వాటా విలువ సుమారు రూ.5,956 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండు కింద రూ.16ను ఈ ఏడాది మే 31న ఇన్ఫోసిస్‌ చెల్లించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ నెలలో కూడా రూ.16.5 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ రెండు డివిడెండ్లు కలిపితే ఒక్కో షేరుకు   రూ.32.5  చొప్పున.. అక్షత వద్ద ఉన్న 3.89 కోట్ల షేర్లకు  రూ.126.61 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్‌ 2021లోనూ ఒక్కో షేరుకు మొత్తంగా రూ.30 డివిడెండు చెల్లించింది. ఆ ఏడాది కూడా అక్షత డివిడెండు రూపేణా రూ.119.50 కోట్లు ఆర్జించారు. భారత పౌరసత్వం ఉన్న అక్షత బ్రిటన్‌లో ‘నాన్‌- డొమిసైల్‌’ పన్ను హోదాలో నివసిస్తున్నారు. ఈ హోదా ఉన్న వారు.. 15 ఏళ్ల పాటు విదేశాల్లో ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే ఏప్రిల్‌లో ప్రధాని రేసులోకి సునాక్‌ అడుగుపెట్టినప్పుడు అక్షత పన్ను హోదా అంశంపై బ్రిటన్‌లో తీవ్రంగా చర్చ జరిగింది. దీంతో తన భర్త పదవికి ఇది ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో.. విదేశాల్లో ఆర్జించే ఆదాయం మీద లభిస్తున్న ఈ పన్ను ప్రయోజనాన్ని ఇక పొందబోనని ఆ సమయంలో ఆమె స్పష్టం చేశారు. అయితే ఏప్రిల్‌ తర్వాత నుంచి ఆమె బ్రిటన్‌లో ఎంత పన్ను చెల్లించారనే వివరాలపై కచ్చితమైన సమాచారమైతే లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని