ఉద్యోగులకు ఫాక్స్‌కాన్‌ క్షమాపణలు

యాపిల్‌ ఐఫోన్‌లను అసెంబ్లింగ్‌ చేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ తన చైనా ప్లాంటు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది.

Published : 25 Nov 2022 03:35 IST

బీజింగ్‌: యాపిల్‌ ఐఫోన్‌లను అసెంబ్లింగ్‌ చేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ తన చైనా ప్లాంటు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. కరోనా ఆంక్షల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ప్లాంటులో ఉత్పత్తి తగ్గి.. ఐఫోన్‌ 14 డెలివరీలు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ వేతన నిబంధనల్లో మార్పులపై ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అభద్రతా పరిస్థితులున్నాయంటూ చాలా మంది ఉద్యోగులు గత నెల బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కార్మికుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఫాక్స్‌కాన్‌ ముందుకొచ్చింది. కొత్త ఉద్యోగులను జత చేయడంలో జరిగిన ‘సాంకేతిక తప్పిదం’ వల్ల వేతన నిబంధనల్లో మార్పులు జరిగాయని తెలిపింది. కంప్యూటర్‌లో వచ్చిన పొరబాటుకు క్షమాపణలు సైతం కోరింది.

ఏం జరిగిందంటే..: ఐఫోన్‌ 14 డెలివరీల విషయంలో యాపిల్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఫాక్స్‌కాన్‌ కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇందు కోసం రెండు నెలల పనికి 3500 డాలర్లను ఇవ్వజూపింది. అయితే విధుల్లోకి వచ్చాక.. అదనంగా మరో రెండు నెలల పాటు తక్కువ వేతనానికి పనిచేయాలంటున్నారన్నది కార్మికుల ఫిర్యాదు. ఒక వేళ వెళ్లిపోవాలనుకుంటే 1400 డాలర్లే ఇస్తామని చెప్పిందని వారంటున్నారు. మరో వైపు, అయిదు రోజుల పాటు ఇంట్లోనే ఉండాలంటూ చైనా ప్రభుత్వం తాజాగా ప్రకటించడం చూస్తే, ఈ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో అర్థం కావడం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని