Adani Group: అదానీ అవకతవకలపై సెబీకి ఆధారాలు దొరకలేదు!

అదానీ గ్రూప్‌ (Adani Group)పై అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తోంది. పద్దుల్లో అవకతవకలకు పాల్పడ్డాయని, షేరు విలువను కృత్రిమంగా పెంచుతున్నాయనేది హిండెన్‌బర్గ్‌ ప్రధాన ఆరోపణ.

Updated : 01 Mar 2023 09:44 IST

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై దర్యాప్తు నేపథ్యం

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group)పై అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తోంది. పద్దుల్లో అవకతవకలకు పాల్పడ్డాయని, షేరు విలువను కృత్రిమంగా పెంచుతున్నాయనేది హిండెన్‌బర్గ్‌ ప్రధాన ఆరోపణ. అదానీ గ్రూప్‌ (Adani Group) నమోదిత సంస్థలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా, ఆయా కంపెనీల షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించిన అంశాలపై సెబీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయా అంశాల్లో అదానీ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని సంబంధిత వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

* హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు నిగూఢ ఉద్దేశంతో చేసినవని, తప్పుడు మార్కెట్‌ సృష్టించేందుకు, భారతీయ సంస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించడం, దేశ స్వాతంత్య్రం, సమగ్రతలపై దాడిగా అదానీ పేర్కొన్నందున, వాటిపైనా సెబీ పరిశీలన చేస్తుందని సమాచారం.

* ఇప్పటివరకు దర్యాప్తునకు సంబంధించి సెబీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సెబీ చర్యలను అధికారిక దర్యాప్తుగా భావించలేమని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాలపై అదానీ గ్రూప్‌, హిండెన్‌బర్గ్‌ స్పందించలేదు.

* హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు వెలుగుచూసిన జనవరి 24 నుంచి ఇప్పటివరకు అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.12 లక్షల కోట్లు పతనమై, సాధారణ మదుపర్లు తీవ్రంగా నష్టపోయారు.

ఈ నెలాఖరుకు 790 మి.డాలర్ల రుణాల చెల్లింపు!: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 690- 790 మిలియన్‌ డాలర్ల షేరు తనఖా రుణాలను చెల్లించడానికి అదానీ గ్రూప్‌ సన్నాహాలు చేస్తోంది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత రుణ భారాన్ని తగ్గించుకోవడంపై సంస్థ దృష్టి సారించింది. షేర్ల విలువల పతనం నేపథ్యంలో వినియోగదారుల్లో విశ్వాసం పెంచేందుకు సింగపూర్‌, హాంకాంగ్‌లలో ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ రోడ్‌షోను నిర్వహించింది. అయినా రుణాలను ముందుగానే చెల్లించాలని భావిస్తోంది. 2024 బాండ్లను 800 మిలియన్‌ డాలర్లతో రీఫైనాన్స్‌ చేసేందుకు అదానీ గ్రీన్‌ ఎనర్జీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రణాళికలను బాండుదారులకు హాంకాంగ్‌లో అదానీ గ్రూప్‌ తెలియజేసింది. రుణాల రీఫైనాన్స్‌ లేదా మూలధన సమీకరణ ప్రణాళికలు లేనట్లు కంపెనీ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌ సింగ్‌ ఇటీవల వెల్లడించారు.

రుణాలపై అతిగా భయాలు.. ఎస్‌ఈఎస్‌: అదానీ గ్రూప్‌ రుణాలపై అతిగా ఆందోళనలు నెలకొన్నట్లు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ పరిశోధన, ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఎస్‌ఈఎస్‌ (స్టేక్‌హోల్డర్స్‌ ఎంపవర్‌మెంట్‌ సర్వీసెస్‌) తాజా నివేదికలో పేర్కొంది. తమ వాటాదారు కానప్పటికీ హిండెన్‌బర్గ్‌కు అదానీ గ్రూప్‌ సమాధానం ఇచ్చిందని.. ఇదేవిధంగా తమ వాటాదార్ల (పెట్టుబడిదారులు, రుణదాతల ఆర్థిక భద్రతకు అదానీ గ్రూప్‌ జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆందోళనలకు సమాధానం ఇవ్వాలని సూచించింది. అదానీ గ్రూప్‌ ఖాతాలపై స్వతంత్ర థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిర్వహించి, పద్దులు సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరిస్తే గ్రూప్‌పై విశ్వసనీయత ఇనుమడిస్తుందని అభిప్రాయపడింది.

* 2022 సెప్టెంబరు ఆఖరుకు అదానీ గ్రూప్‌ స్థూల రుణాలు రూ.2.26 లక్షల కోట్లు కాగా, నగదు నిల్వలు రూ.31,646 కోట్లుగా ఉన్నాయి. 2023 జనవరి నుంచి 2024 మార్చి మధ్య రూ.17,166 కోట్ల బకాయిలను సంస్థ తీర్చాల్సి ఉంది.

* రుణ చెల్లింపులకు అవసరమైన నగదు నిల్వలు సంస్థ వద్ద ఉన్నట్లు ఎస్‌ఈఎస్‌ పేర్కొంది. అదానీ కంపెనీల్లో ప్రమోటర్‌ వాటా షేర్లలో 25 శాతం కనుక తనఖాలో ఉంటే,

పుంజుకున్న అదానీ షేర్లు: గత నెలరోజులుగా తీవ్రంగా పతనమైన అదానీ గ్రూప్‌ షేర్లు, మంగళవారం కొద్దిగా పుంజుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 14.22% రాణించి రూ.1364.05 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ 5.44%, అదానీ గ్రీన్‌ 5%, అదానీ విల్మర్‌ 5%, ఎన్‌డీటీవీ 4.99%, అదానీ పవర్‌ 4.98%, అంబుజా సిమెంట్స్‌ 3.75%, ఏసీసీ 2.24% చొప్పున పరుగులు తీశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.99% మేర నష్టపోయాయి.

* హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత ఇప్పటివరకు అదానీ గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ దాదాపు 147 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.12.07 లక్షల కోట్ల) వరకు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని