అదానీ అదుర్స్‌..

విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్‌ ఇలా పలు వ్యాపారాల్లో నిమగ్నమైన అదానీ గ్రూపు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌- జూన్‌) రూ.23,532 కోట్ల ఎబిటా (పన్ను ముందు లాభం)ను నమోదుచేసింది.

Updated : 27 Aug 2023 10:18 IST

ఏప్రిల్‌-జూన్‌లో 42% పెరిగిన గ్రూపు ఎబిటా
రూ.23,532 కోట్లుగా నమోదు
2018-19 మొత్తం మీద ఆర్జించిన లాభానికి ఇది సమానం

దిల్లీ: విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్‌ ఇలా పలు వ్యాపారాల్లో నిమగ్నమైన అదానీ గ్రూపు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌- జూన్‌) రూ.23,532 కోట్ల ఎబిటా (పన్ను ముందు లాభం)ను నమోదుచేసింది. ఏడాదిక్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇది 42 శాతం ఎక్కువ. అంతేకాకుండా 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద నమోదైన రూ.24,780 కోట్లకు ఇది ఇంచుమించు సమానమని, ఆకర్షణీయ పనితీరును కనబర్చామనడానికి ఇది నిదర్శనమని అదానీ గ్రూపు ఒక ప్రకటనలో తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌.. ఇలా 10 నమోదిత సంస్థలను కలిగి ఉన్న అదానీ గ్రూపునకు రూ.18,689.70 కోట్ల మేర రుణాలు, రూ.42,115 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కాగా.. అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఈ ఏడాది జనవరిలో పలు ఆరోపణలు చేస్తూ నివేదికను విడుదల చేసిన తర్వాత.. అదానీ గ్రూపు కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ ఆరోపణలను ఖండిస్తూనే.. మదుపర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ముందుగానే అప్పులు చెల్లించడం సహా పలు చర్యలను అదానీ గ్రూపు చేపట్టింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు కనిష్ఠ స్థాయిల నుంచి గణనీయంగా పుంజుకున్నాయి. అదానీ గ్రూపులోని ఐదు నమోదిత సంస్థల్లో ప్రమోటర్లు తమ వాటాలను జీక్యూజీ పార్ట్‌నర్స్‌ లాంటి సంస్థలకు విక్రయించడం కూడా షేర్లు కోలుకోవడానికి తోడ్పడ్డాయి. ఏప్రిల్‌- జూన్‌లో ఆయా వ్యాపారాలపై అదానీ గ్రూపు వెల్లడించిన వివరాలు ఇలా..

  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నేతృత్వంలోని కొత్త వ్యాపార విభాగాలు (విమానాశ్రయాలు, హరిత హైడ్రోజన్‌, ఇతరత్రా కొన్ని) ఆకర్షణీయ పనితీరుతో ముందుకెళ్తున్నాయి. ఈ విభాగాల లాభాలు ఏడాదిక్రితంతో పోలిస్తే ఏప్రిల్‌- జూన్‌లో సుమారు రెట్టింపు అయ్యాయి. వీటి ఎబిటా రూ.1,718 కోట్లుగా ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మొత్తం ఎబిటాలో ఈ తరహా వ్యాపారాల వాటా 7 శాతంగా ఉంది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రస్తుత వ్యాపారాల ఎబిటా 12 శాతం తగ్గింది. బొగ్గు ధరల్లో దిద్దుబాటు, అమ్మకాల్లో స్తబ్దత ఇందుకు కారణమయ్యాయి.
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లోని విమానాశ్రయాల ప్రయాణికుల సంఖ్య 27 శాతం వృద్ధితో 2.13 కోట్లకు చేరింది. రహదారుల వ్యాపార విభాగం అదనంగా 79.8 కి.మీల మేర రహదారులను నిర్మించింది. సోలార్‌ మాడ్యుల్‌ల అమ్మకాలు 87 శాతం వృద్ధితో 614 మెగావాట్లకు చేరాయి. చెన్నై వద్ద ఉన్న 17 మెగావాట్ల డేటా కేంద్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.
  • అదానీ గ్రీన్‌ ఎబిటా 67 శాతం వృద్ధితో రూ.2,200 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల సామర్థ్యాన్ని 43 శాతం మేర పెంచుకొని 8,316 మెగావాట్లకు చేర్చడం ఇందుకు దోహదం చేసింది.
  • వ్యయ నియంత్రణ, కార్యకలాపాల అనుసంధానంతో సిమెంట్‌ వ్యాపారం కూడా ఆకర్షణీయ పనితీరు కనబర్చింది. ఒక టన్నుకు ఎబిటా 2022 ఏప్రిల్‌- జూన్‌లో రూ.888గా ఉండగా.. 2023 ఏప్రిల్‌- జూన్‌లో రూ.1,253కు పెరిగింది. ఈ ఏడాది జనవరి- మార్చిలోని రూ.1,079 కంటే కూడా ఇది ఎక్కువ. దీంతో సిమెంట్‌ వ్యాపారం ఎబిటా ఏడాదిక్రితంతో పోలిస్తే 54 శాతం పెరిగి రూ.1,935 కోట్లకు చేరింది.
  • అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ (ఇంతకుమునుపు అదానీ ట్రాన్స్‌మిషన్స్‌) తన విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను 550 సర్క్యూట్‌ కి.మీ మేర ఎంచుకొని 19,788 సర్క్యూట్‌ కి.మీకు చేర్చుకుంది.
  • అదానీ గ్యాస్‌ కొత్తగా 7 సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 467కు చేరింది. అలాగే 141 విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ సుమారు 7 లక్షల కుటుంబాలకు పైప్డ్‌ వంటగ్యాస్‌ను సరఫరా చేస్తోంది.
  • అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ ఒక త్రైమాసికంలోనే అత్యధికంగా 101.40 మిలియన్‌ టన్నుల కార్గో రవాణాను నమోదు చేసింది.
  • అదానీ పవర్‌ 1,600 మెగావాట్ల గొడ్డ అల్ట్రా- సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ ప్లాంటును ప్రారంభించింది.
  • అదానీ గ్రూపు ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ అదానీ విల్మర్‌ అమ్మకాలు 1.49 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితంతో పోలిస్తే 25 శాతం వృద్ధిని నమోదుచేసింది.
  • అంబుజా సిమెంట్‌, ఏసీసీతో కూడిన అదానీ గ్రూప్‌ సిమెంట్‌ వ్యాపార విభాగం అమ్మకాలు 9 శాతం పెరిగి 15.4 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని