Hyundai Motor: అన్ని వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు: హ్యుందాయ్‌ మోటార్‌

దేశంలో తాము ఉత్పత్తి చేస్తున్న అన్ని వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నామని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మంగళవారం తెలిపింది.

Published : 04 Oct 2023 10:03 IST

దిల్లీ: దేశంలో తాము ఉత్పత్తి చేస్తున్న అన్ని వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నామని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మంగళవారం తెలిపింది. కారు భద్రతా ప్రమాణాలను పరీక్షించి, రేటింగ్‌ ఇచ్చేందుకు ఇటీవల తీసుకొచ్చిన ‘భారత్‌ ఎన్‌క్యాప్‌’లో స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. తొలుత 3 మోడళ్లతో మొదలుపెట్టి తర్వాత అన్ని మోడళ్లను ఇందులో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించింది. భారత్‌ ఎన్‌క్యాప్‌ కార్యక్రమం కింద కార్ల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా తమ వాహనాలను ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్‌ (ఏఐఎస్‌) 197 కింద పరీక్షించేందుకు అందించొచ్చు. ఆయా కార్ల పని తీరు ఆధారంగా 0-5 మధ్య స్టార్‌ రేటింగ్‌లను అందిస్తారు. ఇందులో అడల్డ్‌ ఆక్యుపెంట్లు (ఏఓపీ), చైల్డ్‌ ఆక్యుపెంట్ల (సీఓపీ)కు రేటింగ్‌ ఇస్తారు. కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ స్టార్‌ రేటింగ్‌లను ఆధారంగా చేసుకుని, వివిధ వాహనాల్లో ఉన్న భద్రతా ప్రమాణాలను అంచనా వేసుకుని తగిన నిర్ణయం తీసుకునేందుకు భారత్‌ ఎన్‌క్యాప్‌ తోడ్పడుతుంది. తమ మధ్య స్థాయి సెడాన్‌ వెర్నా గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌లో అడల్ట్‌, చైల్డ్‌ ఆక్యుపెంట్‌ రక్షణలో 5-స్టార్‌ రేటింగ్‌ పొందినట్లు హ్యుందాయ్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని