సంక్షిప్త వార్తలు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్‌ఐఎల్‌ లిమిటెడ్‌, పైపులు- ఫిట్టింగ్స్‌ వ్యాపారంలోకి విస్తరిస్తోంది.

Published : 28 Apr 2024 01:35 IST

పైపులు, ఫిట్టింగ్స్‌ వ్యాపారంలోకి హెచ్‌ఐఎల్‌

క్రెస్టియా పాలీటెక్‌-అనుబంధ సంస్థల కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్‌ఐఎల్‌ లిమిటెడ్‌, పైపులు- ఫిట్టింగ్స్‌ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. దేశంలో ఈ వ్యాపార వార్షిక అమ్మకాలు రూ.55,000 కోట్ల స్థాయిలో ఉండగా, ఏటా ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తోంది. పైపులు, ఫిట్టింగ్స్‌ విభాగంలో పూర్తి శ్రేణి ఉత్పత్తులను అందించే నిమిత్తం క్రెస్టియా పాలీటెక్‌ అనే సంస్థను హెచ్‌ఐఎల్‌ సొంతం చేసుకుంది. దీనిపై రూ.265 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ కొనుగోలుతో క్రెస్టియా పాలీటెక్‌కు అనుబంధంగా ఉన్న టాప్‌లైన్‌ ఇండస్ట్రీస్‌, ఆదిత్య పాలీటెక్నిక్‌, ఆదిత్య ఇండస్ట్రీస్‌, సాయినాథ్‌ పాలీమర్స్‌తో పాటు ఈ సంస్థలకు చెందిన టాప్‌లైన్‌, రాక్‌వెల్‌, సోనిప్లాస్ట్‌ బ్రాండ్లు హెచ్‌ఐఎల్‌ చేతికి వస్తున్నాయి.

క్రెస్టియా పాలీటెక్‌కు తూర్పు భారతదేశంలో పైపులు, ఫిట్టింగ్స్‌, నీటి ట్యాంకుల వ్యాపారంలో అధిక మార్కెట్‌ వాటా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి క్రెస్టియా, దాని అనుబంధ సంస్థలు రూ.330 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశాయి. తాజా లావాదేవీతో హెచ్‌డీపీఈ, ఎండీపీఈ ఉత్పత్తులు, నీటి ట్యాంకుల మార్కెట్లో హెచ్‌ఐఎల్‌ అడుగుపెట్టినట్లు అవుతుంది. ఈ విభాగంలో 2026 నాటికి టర్నోవర్‌ను 5 రెట్లు పెంచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు హెచ్‌ఐఎల్‌  అధ్యక్షురాలు అవంతీ బిర్లా తెలిపారు.  


ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లాభంలో 10 శాతం క్షీణత

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నికర లాభం 10 శాతం తగ్గి రూ.724 కోట్లకు పరిమితమైంది. కేటాయింపులు గణనీయంగా పెరగడం ఇందుకు కారణమైంది. కిందటేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.803 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.7,822 కోట్ల నుంచి పెరిగి రూ.9,861 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) కూడా రూ.3,597 కోట్ల నుంచి 24 శాతం పెరిగి రూ.4,469 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.51 శాతం నుంచి 1.88 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.86 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గాయి. అయితే కేటాయింపులు రూ.482 కోట్ల నుంచి 50 శాతం మేర పెరిగి రూ.722 కోట్లకు చేరాయి. 2023-24, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎటువంటి డివిడెండును ప్రకటించలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 16.82 శాతం నుంచి 16.11 శాతానికి తగ్గింది.


విస్తరణ బాటలో యాక్సెస్‌ మెడిటెక్‌

ఈనాడు, హైదరాబాద్‌: బీమా సంస్థలకు సాంకేతిక సేవలను అందించే ఇన్సూర్‌టెక్‌ సంస్థ యాక్సెస్‌ మెడిటెక్‌ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. బీమా సంస్థలతోపాటు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు(టీపీఏ), బీమా సలహాదారులకూ అవసరమైన సాంకేతిక సేవలను ఈ సంస్థ అందిస్తోంది. విస్తరణలో భాగంగా కొత్త మార్కెట్లలో తమ ఉత్పత్తులను పరిచయం చేయబోతున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సయ్యద్‌ ఐజాజుద్దీన్‌ పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధితోపాటు బీమా రంగంలోని సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 130 మంది ఉద్యోగులున్నారని, కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ఈ ఏడాది చివరి నాటికి మరో 50 మంది వరకూ నియమించుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, సౌదీ అరేబియా, దుబాయ్‌లలో కార్యాలయాలు ఉన్నాయని, 2025 నాటికి ఐరోపాలో అడుగుపెడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని