Reliance: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి కొవిడ్‌-19 ఔషధం

కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే ఔషధాలు ఆవిష్కరించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ‘నిక్లోసామైడ్‌’ అనే మందును కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించాలని ప్రతిపాదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యవసర ఔషధాల్లో ఇది ఒకటి.

Updated : 04 Jun 2021 09:29 IST

‘నిక్లోసామైడ్‌’ వినియోగం కోసం దరఖాస్తు

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే ఔషధాలు ఆవిష్కరించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ‘నిక్లోసామైడ్‌’ అనే మందును కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించాలని ప్రతిపాదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యవసర ఔషధాల్లో ఇది ఒకటి. దీన్ని 50 ఏళ్లుగా నులిపురుగుల నివారణ (టేప్‌వార్మ్‌ ఇన్ఫెక్షన్‌) లో వినియోగిస్తున్నారు. 2003-04లో ఆఫ్రికా దేశాల్లో, మరికొన్ని ఇతర దేశాల్లో వెలుగుచూసిన సార్స్‌ వ్యాధికి చికిత్సలో వైద్యులు ఈ మందు సిఫారసు చేశారు. ‘నిక్లోసామైడ్‌’ ఔషధాన్ని కొవిడ్‌-19 బాధితులకు చికిత్సలో వినియోగించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశాం’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ మందు తయారు చేయాలనుకుంటోందా.. లేక తన ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో వినియోగించాలనుకుంటోందా.. అనే విషయాన్ని సంస్థ స్పష్టం చేయలేదు. మనదేశంలో కొవిడ్‌-19 బాధితులపై ఈ మందును ఇప్పటికే పరీక్షిస్తున్నారు. దీనిపై రెండో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ఇదే కాకుండా నెగ్జర్‌ పాలీమర్‌ అనే ఔషధంపైనా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆర్‌అండ్‌డీ బృందం దేశంలోని సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) ల్యాబ్‌లతో కలిసి పరీక్షలు నిర్వహిస్తోంది. పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల మనుషుల శరీరంలో ఏర్పడే లిపిడ్‌ పొరను నాశనం చేయడానికి ఈ మందు ఉపకరిస్తుందని అంచనా.

చౌకగా నిర్థారణ పరీక్షలు కూడా
కొవిడ్‌-19 నిర్థారణకు తక్కువ ధరల్లో లభించే డయాగ్నస్టిక్‌ కిట్లను సైతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేస్తోంది. ఆర్‌-గ్రీన్‌, ఆ-గ్రీన్‌ ప్రొ కిట్లను ఇప్పటికే ఆవిష్కరించింది. వీటికి ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) గుర్తింపు లభించింది. ఎంతో తక్కువ ధరలో శానిటైజర్లను తయారు చేసే ప్రాసెస్‌ను అభివృద్ధి చేసింది. ఆక్సిజన్‌ కొరత, వెంటిలేటర్లు ఉన్న గదుల కొరతను పరిగణనలోకి తీసుకుని ఇటలీలో మాదిరిగా 3డి-ప్రింటెడ్‌ ఛార్లొట్టే వాల్వ్‌, స్నోర్కెల్లింగ్‌ మాస్క్‌తో కూడిన సిపాప్‌ మెషీన్‌ను ఆవిష్కరించే పనిలో నిమగ్నమైంది. ఆక్సిజన్‌ జనరేటర్లను డిజైన్‌ చేసే ప్రాజెక్టునూ చేపట్టింది.

900 మందికి పైగా పరిశోధన
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 900 మందికి పైగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వివిధ రకాల సాంకేతిక సవాళ్లకు సమాధానాలు కనుగొనడం ఈ శాస్త్రవేత్తల పని. ఇందులో కొన్ని బృందాలు ఇప్పుడు కొవిడ్‌-19కు పరిష్కారమార్గాలు అన్వేషించే పనిలో నిమగ్నమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని