Updated : 16 Jul 2021 10:10 IST

యూఎస్‌ టెక్‌ షేర్లలో...  పరోక్షంగా మదుపు

కోటక్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌

విదేశీ ఈక్విటీల్లో... ముఖ్యంగా అమెరికా టెక్‌ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టటానికి ఆసక్తిగా ఉన్నారా? ఫ్యాంగ్‌ స్టాక్స్‌ (ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌) పై లాభాలు ఆర్జించాలనే ఆలోచన చేస్తున్నారా? ఇందుకు దేశీయ మదుపరులకు వీలు కల్పిస్తూ.. ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని కోటక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తీసుకొచ్చింది. కోటక్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) అనే ఈ పథకం కింద దేశీయ మదుపరుల నుంచి సమీకరించే సొమ్మును వెల్లింగ్టన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ యూనిట్లలో పెట్టుబడిగా పెడుతుంది. ఇది అమెరికాలో పరిశోధన- అభివృద్ధి ఆధారంగా టెక్నాలజీ రంగంలో విశేషంగా ఎదుగుతున్న కంపెనీల షేర్లు కొనుగోలు చేస్తుంది. అంటే కోటక్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) లో మదుపు చేస్తే.. పరోక్షంగా యూఎస్‌ టెక్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లే.

ఈ ఫండ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ముగింపు తేదీ ఈ నెల 22. కనీస పెట్టుబడి రూ.5,000. దీనికి అర్జున్‌ ఖన్నా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

యూఎస్‌కు చెందిన పెట్టుబడుల నిర్వహణ సంస్థ వెల్లింగ్టన్‌ మేనేజ్‌మెంట్‌ కింద 1 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (ఏయూఎం) ఉన్నాయి. టిఐబిఆర్‌ (ట్రెండ్‌సెట్టర్స్‌, ఇన్నోవేటివ్‌, హై-ఎంట్రీ బారియర్‌, ఎలిమినేటింగ్‌ రిస్క్‌) విధానంలో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. అందుకే అమెరికాలో ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు, కోటక్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌), ‘ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ పద్ధతిని అనుసరిస్తూ వెల్లింగ్టన్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ యూనిట్లను ఎంచుకుంది.

ప్రపంచ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించే కంపెనీలు వృద్ధి పథంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఐటీ రంగంలో వస్తున్న టెక్నాలజీ మార్పులు, ఆయా టెక్నాలజీల ఆధారంగా వస్తు- సేవలు అందిస్తున్న కంపెనీలు నమోదు చేస్తున్న ఆదాయాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది, రెండేళ్ల కాలంలో ‘ఫ్యాంగ్‌’ స్టాక్స్‌ మదుపరులకు లాభాల పంట పండించటం... ఈ కోవలోకి వచ్చే పరిణామమే.


స్వల్పకాలిక పెట్టుబడి కోసం...

యాక్సిస్‌ ఫ్లోటర్‌ ఫండ్‌

స్వల్పకాలానికి నిధులు నిల్వ చేయాలనే ఆలోచన ఉన్న వారి కోసం యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తొలిసారిగా ఒక ఫ్లోటర్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. యాక్సిస్‌ ఫ్లోటర్‌ ఫండ్‌ అనే పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 26 ముగియనుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఫ్లోటింగ్‌ రేట్‌ రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టి స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించాలనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం. దాదాపు 75 శాతం సొమ్మును ఏఏఏ రేటింగ్‌ ఉన్న పత్రాల్లో పెట్టుబడి పెడతారు. మిగిలిన సొమ్మును కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేయటానికి కేటాయిస్తారు. ఫ్లోటర్‌ ఫండ్స్‌ కింద మనదేశంలో దాదాపు రూ.80,000 కోట్ల సొమ్ము ఉంది. ఈ మార్కెట్లోకి యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తొలిసారిగా ప్రవేశిస్తోంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఫిక్స్‌డ్‌ రేట్ల బాండ్లపై ప్రతిఫలం తగ్గిపోతుందనేది తెలిసిందే. దీనికి ‘హెడ్జ్‌’ గా ఫ్లోటింగ్‌ ఫండ్స్‌ ఉపకరిస్తాయి. యాక్సిస్‌ ఫ్లోటర్‌ ఫండ్‌ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీనికి ఆదిత్య పగారియా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని