సంక్షిప్త వార్తలు

మాంసాహార ఉత్పత్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విక్రయించే బెంగళూరు సంస్థ నందూస్‌ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. తొలి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించామని, డిసెంబరుకు మొత్తం 5 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ...

Published : 30 Nov 2021 02:06 IST

హైదరాబాద్‌కు నందూస్‌

ఈనాడు, హైదరబాద్‌: మాంసాహార ఉత్పత్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విక్రయించే బెంగళూరు సంస్థ నందూస్‌ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. తొలి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించామని, డిసెంబరుకు మొత్తం 5 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నందూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ నరేంద్ర పసుపర్తి తెలిపారు. దేశ వ్యాప్తంగా నాలుగేళ్లలో 300 స్టోర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు. పౌల్ట్రీ సంస్థ నందా గ్రూపులో భాగమైన నందూస్‌ హైదరాబాద్‌లో 150 మందిని నియమించుకోనుంది. వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్న బిర్యానీ కిట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.


రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు: నిస్సాన్‌

టోక్యో: వచ్చే 5 ఏళ్లలో మరిన్ని విద్యుత్‌ వాహనాలు ఆవిష్కరించేందుకు, చౌకగా, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలను అభివృద్ధి చేసేందుకు 2 లక్షల కోట్ల యెన్‌ల (1,760 కోట్ల డాలర్లు-సుమారు రూ.1.32 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టబోతున్నట్లు జపాన్‌కు చెందిన నిస్సాన్‌ మోటార్‌ సంస్థ వెల్లడించింది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి తమ సంస్థ నుంచి 15 విద్యుత్‌ వాహనాలు విపణిలోకి వస్తాయని నిస్సాన్‌ సీఈఓ మకోటో ఉచిదా వెల్లడించారు.


నందల్‌ ఫైనాన్స్‌ చేతికి సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌

రూ.210 కోట్లకు విక్రయించనున్న ప్రభుత్వం

దిల్లీ: ప్రభుత్వరంగ సోలార్‌ ఫోటోవోల్టాయిక్‌ సంస్థ సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (సీఈఎల్‌), నందల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ చేతికి వెళ్లబోతోంది. రూ.210 కోట్లకు సీఈఎల్‌ను విక్రయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో పెద్ద వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియగా ఇది నిలవనుంది. 1974లో వ్యవస్థాపితమైన సీఈఎల్‌.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ (ఎస్‌పీవీ) సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సంస్థగా సీఈఎల్‌ను చెబుతుంటారు. రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో ఉపయోగించే యాక్సెల్‌ కౌంటర్‌ వ్యవస్థలను కూడా ఈ సంస్లే అభివృద్ధి చేసింది. సీఈఎల్‌ విక్రయం నిమిత్తం 2020 ఫిబ్రవరి 3న ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (ఈఓఐ) దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించగా.. మూడు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో రెండు సంస్థలే అక్టోబరు 12, 2021 కల్లా బిడ్‌లు దాఖలు చేశాయి. ఘజియాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నందల్‌ ఫైనాన్స్‌ రూ.210 కోట్లకు, జేపీఎం ఇండస్ట్రీస్‌ రూ.190 కోట్లకు బిడ్‌లు వేశాయి. అందువల్ల నందల్‌ ఫైనాన్స్‌కు సీఈఎల్‌ను విక్రయించేందుకు వ్యూహాత్మక పెట్టుబడులపై ఏర్పాటైన ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని