అమెజాన్‌- ఫ్యూచర్‌ కేసు విచారణ 11కు వాయిదా

అమెజాన్‌- ఫ్యూచర్‌ గ్రూప్‌ కేసులో ఇరుపక్షాలు భారీగా పత్రాలను అనువుగాని సమయంలో సమర్పించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది.

Published : 09 Dec 2021 01:54 IST

దిల్లీ: అమెజాన్‌- ఫ్యూచర్‌ గ్రూప్‌ కేసులో ఇరుపక్షాలు భారీగా పత్రాలను అనువుగాని సమయంలో సమర్పించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ అత్యవసర ఆదేశాల్లో జోక్యం చేసుకోకూడదంటూ అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ తీసుకున్న నిర్ణయంపై స్టేని నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఫ్యూచర్‌ గ్రూపు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ వేసింది. ఈ కేసు నిమిత్తం కట్టల కొద్దీ పత్రాలకు బదులు తక్కువ సంఖ్యలో సమర్పిస్తే చాలని ఇంతకుమునుపే ఇరుపక్షాలకు కోర్టు సూచించింది. అయితే ఫ్యూచర్‌ గ్రూపు సమర్పించిన లిఖిత పూర్వక పత్రాలపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ముందస్తుగా మాకు పత్రాలు సమర్పిస్తే, వాటిని చదివే వీలుంటుందన్నదే గత ఆదేశాల వెనక మా ఉద్దేశం. రాత్రి 10 గంటలకు ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ నుంచి ఈ పత్రాలు వచ్చాయి. ఈ రోజు ఉదయం ఇంకో పార్టీ నుంచి పత్రాలు అందాయ’ని ధరాస్మనం పేర్కొంది. ‘వీటితో ఇప్పుడు ఏం చేయగలుగుతాము, మీరు చేసింది సరైన విధానం కాద’ని ధర్మాసనం తెలిపింది.


అమెజాన్‌ క్లౌడ్‌కంప్యూటింగ్‌లో సాంకేతిక సమస్య

అమెరికాలో కంపెనీల సేవలకు ఆటంకం

వాషింగ్టన్‌: అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా అమెరికాలోని కంపెనీలకు అయిదు గంటలకు పైగా తీవ్ర ఆటంకం ఏర్పడింది. కంపెనీలు ఇంటర్నెట్‌పై ఏ స్థాయిలో ఆధారపడుతున్నాయో తాజా ఘటన కారణంగా తెలుస్తోంది. అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తూర్పు అమెరికాపై అధిక ప్రభావం చూపింది. విమాన రిజర్వేషన్‌ల నుంచి వాహన డీలర్‌షిప్‌లు, పేమెంట్‌ యాప్‌లు, వీడియో స్ట్రీమింగ్‌ సేవలు, ఇ-కామర్స్‌ కార్యకలాపాలపై వరకు అన్నింటిపై ప్రభావం పడింది. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే సమస్య తలెత్తడానికి గల కారణాలను అమెజాన్‌  ప్రకటించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని