
అమెరికా షేల్ వెంచర్ నుంచి ఆయిల్ ఇండియా బయటకు
2.5 కోట్ల డాలర్లకు 20% వాటా విక్రయం
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా, అమెరికా షేల్ ఆయిల్ వెంచర్ నుంచి బయటకొచ్చేసింది. ఆ సంస్థలో ఉన్న 20 శాతం వాటాను 2.5 కోట్ల డాలర్లకు (సుమారు రూ.187 కోట్లు) విక్రయించింది. యూఎస్ షేల్ వ్యాపారం ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ వైదొలగ్గా, ఇప్పుడు ఆయిల్ కూడా వచ్చేసింది. ఆయిల్ ఇండియా (యూఎస్‌ఏ) ఇంక్ (ఆయిల్ ఇండియా పూర్తిస్థాయి అనుబంధ సంస్థ) నియోబ్రారా షేల్ అసెట్, యూఎస్‌ఏలో మొత్తం వాటాను ఉపసంహరించుకున్నట్లు నియంత్రణ సంస్థలకు సమాచారమిచ్చింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కలిసి 2012 అక్టోబరులో హ్యూస్టన్ కేంద్రంగా నడుస్తున్న కార్రిజో ఆయిల్ అండ్ గ్యాస్ నియోబ్రారా షేల్ అసెట్‌లో 8.25 కోట్ల డాలర్లతో 30 శాతం వాటా కొనుగోలు చేశాయి. తమ అనుబంధ సంస్థల ద్వారా ఆయిల్ ఇండియా 20 శాతం, ఐఓసీ 10 శాతం వాటా దక్కించుకున్నాయి.