భారత్‌లోకి ఎఫ్‌డీఐలు 26% తగ్గాయ్‌

గత సంవత్సరం (2021) భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 26 శాతం తగ్గాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది. 2020లో నమోదైనట్లు భారీ మొత్తంలో విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు 2021లో

Published : 21 Jan 2022 02:53 IST

ప్రపంచవ్యాప్తంగా 77% వృద్ధి
ఐక్యరాజ్యసమితి నివేదిక

ఐక్యరాజ్యసమితి: గత సంవత్సరం (2021) భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 26 శాతం తగ్గాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది. 2020లో నమోదైనట్లు భారీ మొత్తంలో విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు 2021లో చోటుచేసుకోకపోవడం ఇందుకు కారణంగా పేర్కొంది. యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రెండ్స్‌ మానిటర్‌ బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా 77 శాతం పెరిగి 1.65 లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. 2020లో ఈ విలువ 929 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ‘వర్థమాన దేశాల్లోకి పెట్టుబడులు రాక పుంజుకోవడం ప్రోత్సాహకర పరిణామం. అయితే పరిమితంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కొత్త పెట్టుబడుల రాక ఆగిపోవడం.. ముఖ్యంగా విద్యుత్‌, ఆహార, ఆరోగ్యం లాంటి ప్రధాన రంగాల్లోకి పెట్టుబడులు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంద’ని యూఎన్‌సీటీఏడీ సెక్రటరీ జనరల్‌ రెబెకా గ్రైన్‌స్పాన్‌ తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు ఇలా..
* అభివృద్ధి చెందిన దేశాల్లోకి ఎఫ్‌డీఐల రాక గణనీయంగా పెరిగింది. 2020తో పోలిస్తే 2021లో మూడు రెట్లు పెరిగి 777 బిలియన్‌ డాలర్లకు చేరాయని అంచనా.
* వర్ధమాన దేశాల్లోకి కూడా ఎఫ్‌డీఐ 30 శాతం పెరిగి 870 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. తూర్పు, ఆగ్నేయాసియాల్లో వృద్ధి వేగవంతం కావడం, లాటిన్‌ అమెరికాలో వృద్ధి కొవిడ్‌-19 ముందు స్థాయికి చేరుకోవడం, పశ్చిమాసియాలోనూ వృద్ధి పుంజుకోవడం ఇందుకు దోహదం చేశాయి.
* దక్షిణాసియాలో ఎఫ్‌డీఐల రాక 24 శాతం తగ్గి 54 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. 2020లో ఇది 71 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
* అమెరికాలో ఎఫ్‌డీఐలు 114 శాతం అధికమై 323 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చైనాలోను ఎఫ్‌డీఐ 20 శాతం వృద్ధితో 179 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
* ప్రపంచవ్యాప్తంగా గతేడాది పెరిగిన ఎఫ్‌డీఐల్లో (718 బిలియన్‌ డాలర్లు) 500 బిలియన్‌ డాలర్లకు పైగా లేదంటే మూడొంతుల ఎఫ్‌డీఐ.. అభివృద్ధి చెందిన దేశాల్లోకి వచ్చాయి. వర్థమాన దేశాలు ముఖ్యంగా పరిమితంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎఫ్‌డీఐలు ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయని నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని