జోరుగా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు

మనదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వ్యవసాయ ప్రధాన వ్యాపకంగా ఉన్న పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు

Published : 23 Jan 2022 03:12 IST

2021-22లో 50 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం

అరటి ఎగుమతుల్లో అనంతపురం ఘనత 

కలిసి వస్తున్న ‘క్లస్టర్ల’ అభివృద్ధి

ఈనాడు - హైదరాబాద్‌

మనదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వ్యవసాయ ప్రధాన వ్యాపకంగా ఉన్న పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు లబ్ది చేకూరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకూ ఎనిమిది నెలల కాలంలో మనదేశంలో నుంచి 31.05 బిలియన్‌ డాలర్ల (1 బిలియన్‌ డాలర్లు= రూ.7,600 కోట్లు) విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇందులో ఆహారోత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాంటేషన్‌ గూడ్స్‌ ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలం నాటితో పోల్చితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో 23.21 శాతం అధికంగా వ్యవసాయ ఎగుమతులు నమోదు చేసినట్లు అవుతోంది.

ఇదే వరసలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి 50 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు సాధించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే సరికొత్త రికార్డు సృష్టించినట్లు అవుతుంది. ‘కొవిడ్‌’ మహమ్మారి వల్ల ఎన్నో సవాళ్లు, సరకు రవాణాకు అడ్డంకులు ఎదురైనప్పటికీ వ్యవసాయోత్పత్తులను అధికంగా ఎగుమతి చేయటం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి..

* ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బియ్యం ఎగుమతులు నమోదు కావచ్చు. 21-22 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

* బాస్మతి రకం కాకుండా, ఇతర రకాల బియ్యం, గోధుమ, పంచదార, ఇతర ఆహారోత్పత్తుల ఎగుమతులు సైతం రికార్డు స్థాయిలో ఉంటాయని అంచనా.

బియ్యం, గోధుమలు, పంచదార, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అధిక ఎగుమతుల వల్ల పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బంగా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర వ్యవసాయాధారిత రాష్ట్రాలకు మేలు జరుగుతుంది.

* ఈ ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్‌ డాలర్ల మేరకు నమోదు కావచ్చని అంచనా. మనదేశం నుంచి ఇంత అధికంగా సముద్ర ఉత్పత్తుల  ఎగుమతి ఇదే తొలిసారి అవుతుంది.

* మిర్చి, పసుపు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు  4.8 బిలియన్‌ డాలర్లు ఉండవచ్చు.

* కాఫీ ఎగుమతుల్లో 35 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కాఫీ ఎగుమతులు జరుగుతున్నాయి.

వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని క్లస్టర్లు అభివృద్ధి చెందాయి. పండ్లు, కూరగాయలు ఎగుమతుల కోసం ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో క్లస్టర్‌గా అభివృద్ధి చేశాయి. దీని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తుల అధిక ఎగుమతులకు ఈ ప్రక్రియ దోహదపడినట్లు అధికారవర్గాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నుంచి అరటిపండ్లు అధికంగా ఎగుమతి కావటానికి ఇదొక ప్రధానమైన కారణం. పండ్లు, ఫలాల ఎగుమతులకు ఈ జిల్లా ఎంతో ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతోంది. అరటిపండ్లతో పాటు దానిమ్మ, పుచ్చకాయ, తర్బూజా, నిమ్మకాయలు అనంతపురం, దాని పొరుగున ఉన్న కడప జిల్లా నుంచి పెద్దఎత్తున ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి. ఇదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూరగాయలు, మామిడిపండ్లు, మహారాష్ట్రలోని సోలాపూర్‌ నుంచి దానిమ్మ అధికంగా ఎగుమతి అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని