టెస్లాకు రికార్డు లాభాలు

నాలుగో త్రైమాసికం, పూర్తి ఏడాది(2021)లో టెస్లా రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. అంతర్జాతీయంగా కంప్యూటర్‌ చిప్‌(సెమీ కండక్టర్‌)ల కొరతతో మొత్తం వాహన పరిశ్రమ మందగమనం పాలైనా.. టెస్లా విద్యుత్‌ వాహనాల డెలివరీలు

Published : 28 Jan 2022 03:18 IST

ఈ ఏడాది కొత్త మోడళ్లు ఉండకపోవచ్చు
చిప్‌ల కొరతే కారణం: ఎలాన్‌ మస్క్‌

డెట్రాయిట్‌: నాలుగో త్రైమాసికం, పూర్తి ఏడాది(2021)లో టెస్లా రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. అంతర్జాతీయంగా కంప్యూటర్‌ చిప్‌(సెమీ కండక్టర్‌)ల కొరతతో మొత్తం వాహన పరిశ్రమ మందగమనం పాలైనా.. టెస్లా విద్యుత్‌ వాహనాల డెలివరీలు పుంజుకోవడం ఇందుకు నేపథ్యం. గతేడాదితో పోలిస్తే 2022లో 50 శాతం అధిక వాహనాలను తయారు చేయగలదని కంపెనీ అంచనా వేసినప్పటికీ.. చిప్‌ కొరత వల్ల ఈ ఏడాది ఎటువంటి కొత్త మోడళ్లను తీసుకువచ్చే పరిస్థితి కనిపించడం లేదని కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. అంటే గతేడాదే విక్రయానికి వెళ్లాల్సిన ‘సైబర్‌ట్రక్‌’ పికప్‌ మరింత ఆలస్యం కానుంది.

చిన్న ఈవీ అప్పుడే కాదు..

25,000 డాలర్ల(దాదాపు రూ.18.75 లక్షలు)తో చిన్న విద్యుత్‌ కారును తీసుకొచ్చే పనులను టెస్లా ఇంకా   ప్రారంభించలేదని  మస్క్‌ అన్నారు. గతేడాది 5.5 బిలియన్‌ డాలర్ల లాభాన్ని నమోదు చేసినట్లు ఇది అంతక్రితం ఏడాది(2020) నమోదు చేసిన రికార్డు లాభమైన 3.47 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువని తెలిపారు. గతేడాది 9,36,000 వాహనాలను కంపెనీ డెలివరీ చేసింది. 2020తో పోలిస్తే ఇవి రెట్టింపు. నాలుగో త్రైమాసికంలో డెలివరీ చేసిన 3,08,600 వాహనాలు కూడా రికార్డే.

‘పూర్తి స్వయం చోదిత సాఫ్ట్‌వేర్‌’కు కష్టాలు

‘పూర్తి స్థాయి స్వయం చోదిత’ సాఫ్ట్‌వేర్‌ను అమెరికాలోని 60,000 వాహనాల ద్వారా ప్రజలు రోడ్లపై పరీక్షలు జరుపుతున్నారని కంపెనీ తెలిపింది. అయితే డ్రైవింగ్‌లో మానవుల కంటే ఈ సాఫ్ట్‌వేర్‌ మరింత భద్రతను అందించకపోతే 2022 కల్లా పూర్తి స్వయం చోదనానికి కంపెనీ చేరగలదో లేదోనని మస్క్‌ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నవారు డ్రైవింగ్‌లో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఆటోపైలట్‌లో పలుమార్లు పార్కింగ్‌ చేసిన వాహనాలను గుద్దుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని