బ్యాడ్‌బ్యాంకుకు రూ.50,000 కోట్ల ఎన్‌పీఏలు

నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని రకాల అనుమతులు లభించాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌

Published : 29 Jan 2022 03:29 IST

మార్చి కల్లా బదిలీ అవుతాయ్‌

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా

ముంబయి: నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని రకాల అనుమతులు లభించాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా తెలిపారు. ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు బదిలీ చేసేందుకు రూ.82,845 కోట్ల విలువ గల 38 నిరర్థక ఆస్తుల ఖాతాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. తొలి దశలో మార్చి నాటికి 15 ఖాతాలకు సంబంధించి రూ.50,000 కోట్ల విలువైన బదిలీ చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. మిగిలినవి తదుపరి దశల్లో బదిలీ చేస్తారని తెలిపారు. నిరర్థక ఆస్తుల నిర్వహణ, మార్కెట్‌ వృత్తి నిపుణుల, విశ్లేషకులను నియమించుకోవడం లాంటి బాధ్యతలు నిర్వహించే ఇండియా డెట్‌ రిజల్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌కు (ఐడీఆర్‌సీఎల్‌) కూడా అన్ని రకాల అనుమతులు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఏఆర్‌సీఎల్‌, ఐడీఆర్‌సీఎల్‌లో మెజార్టీ వాటాలు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నిర్వహణలోనే అవి ఉంటాయని ఖరా చెప్పారు.  ఎన్‌ఏఆర్‌సీఎల్‌ను పద్మ కుమార్‌ నాయర్‌, ఐడీఆర్‌సీఎల్‌ను మనీశ్‌ మఖారియా నిర్వహించనున్నారు. బ్యాంకుల నుంచి ఎన్‌పీఏ ఖాతాలను గుర్తించి కొనుగోలు చేయడాన్ని ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నిర్వహిస్తుందని,  ఐడీఆర్‌సీఎల్‌.. రుణ పరిష్కార ప్రక్రియను నిర్వహిస్తుందని దినేశ్‌ ఖారా చెప్పారు.

విదేశీ మదుపర్లలో అపార విశ్వాసం

ఫోర్మోసా బాండ్ల జారీ ద్వారా ఇటీవల ఎస్‌బీఐ 30 కోట్ల డాలర్లను సమీకరించిందని, భారత వృద్ధిపై అంతర్జాతీయ మదుపర్లలో ఉన్న విశ్వాసానికి ఇదే నిదర్శనమని ఖరా అన్నారు. తైవాన్‌లో జారీ చేసే ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరించిన మొదటి భారత సంస్థ ఎస్‌బీఐనే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని