సూచీలకు స్వల్ప నష్టాలు

ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సూచీల భారీ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు సంకేతాలు, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం ఇందుకు నేపథ్యం.

Published : 29 Jan 2022 03:42 IST

సమీక్ష

ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సూచీల భారీ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు సంకేతాలు, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం ఇందుకు నేపథ్యం. బడ్జెట్‌కు ముందు మదుపర్ల అప్రమత్తతా తోడైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 75.10 వద్ద స్తబ్దుగా ముగిసింది.  

సెన్సెక్స్‌ ఉదయం57,795.11 వద్ద లాభాల్లో ప్రారంభమై ఇంట్రాడేలో 58,084.33 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకుని 57,119.28 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 76.71 పాయింట్ల నష్టంతో 57,200.23 వద్ద ముగిసింది. అంటే మొత్తంమీద 884 పాయింట్లను సెన్సెక్స్‌ కోల్పోయింది. నిఫ్టీ 8.20 పాయింట్లు తగ్గి 17,101.95 దగ్గర స్థిరపడింది. వారం ప్రాతిపదికన సెన్సెక్స్‌ 1836.95 పాయింట్లు, నిఫ్టీ 515.20 పాయింట్లు చొప్పున నష్టాలు నమోదుచేశాయి.

త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు ఇంట్రాడేలో 14.85% పెరిగి రూ.396.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 10.99% లాభంతో రూ.383.30 వద్ద ముగిసింది.

* పీఎన్‌బీ షేరు ఇంట్రాడేలో 3.16 శాతం లాభంతో రూ.42.40 వద్ద గరిష్ఠానికి చేరినా, లాభాల స్వీకరణతో 0.61% నష్టంతో రూ.40.85 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 నష్టపోయాయి. మారుతీ 2.99%, టెక్‌ మహీంద్రా 2.43%, పవర్‌గ్రిడ్‌ 2.14%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.62%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.08% మేర డీలాపడ్డాయి. ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, విప్రో, ఐటీసీ, ఎయిర్‌టెల్‌ 3.89% లాభపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని