ముఖ్య ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్‌

 కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా డాక్టర్‌ వి.అనంత నాగేశ్వరన్‌ నియమితులయ్యారని ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది.  ఇదివరకు ఈ స్థానంలో ఉన్న కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం మూడేళ్ల కాలపరిమితి

Published : 29 Jan 2022 03:42 IST

ఈనాడు, దిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా డాక్టర్‌ వి.అనంత నాగేశ్వరన్‌ నియమితులయ్యారని ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది.  ఇదివరకు ఈ స్థానంలో ఉన్న కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం మూడేళ్ల కాలపరిమితి ముగిశాక, గత డిసెంబరులో తిరిగి బోధనా వృత్తికి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని నాగేశ్వరన్‌ భర్తీచేయనున్నారు. 2021-22 ఆర్థిక సర్వేను ఈనెల 31న, 2022-23 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఈయన నియామకం జరిగింది. నాగేశ్వరన్‌ గతంలో వివిధ బిజినెస్‌ స్కూళ్లతో పాటు, భారత్‌, సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్లలో బోధన చేశారు. ఐఎఫ్‌ఎంఆర్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ డీన్‌గా పనిచేశారు. శ్రీసిటీలోని క్రియా యూనివర్శిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైం సభ్యుడిగా పనిచేశారు. 1994 నుంచి 2011 వరకు స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ దేశాల్లోని పలు ప్రైవేటు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో పనిచేశారు. ది ఎకనమిక్స్‌ ఆఫ్‌ డెరివేటివ్స్‌, ద రైజ్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌:కాజెస్‌, కాన్సిక్వెన్సెస్‌ అండ్‌ క్యూర్స్‌ అన్న పుస్తకాలను  రాశారు.

అహ్మదాబాద్‌ ఐఐఎం నుంచి 1985లో మేనేజ్‌మెంట్‌లో పీజీడిప్లొమా చేసిన నాగేశ్వరన్‌, యూనిర్శిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నుంచి 1994లో డాక్టోరల్‌ డిగ్రీ పొందారు.  తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటులో ఈయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కొవిడ్‌ పరిణామాల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న క్రమంలో మూడోదశ ఉద్ధృతి పెరుగుతోంది. ఈ సవాళ్లకు ఆర్థికమంత్రితో కలిసి ఆయన పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది. ఆదాయ అసమానతలు తగ్గించేందుకు, ఉద్యోగ కల్పన పెరిగేందుకు మార్గసూచీ అత్యవసరంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల పెంపుతో పాటు, ఆర్థికలోటు కట్టడికీ తాజా ఉపాయాలు ఆలోచించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని