విన్‌ఎయిర్‌ చేతికి ట్రూజెట్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే విమానయాన సంస్థ ట్రూజెట్‌లో 79 శాతం వాటాను టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రూ.200 కోట్లకు కొనుగోలు

Published : 02 May 2022 01:57 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే విమానయాన సంస్థ ట్రూజెట్‌లో 79 శాతం వాటాను టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రూ.200 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు విన్‌ ఎయిర్‌ (వుయ్‌ ఇండియన్‌ నేషనల్స్‌) ఆదివారం ప్రకటించింది. ట్రూజెట్‌ యాజమాన్య నియంత్రణతో పాటు సంస్థ కార్యకలాపాలు తాము చేపడతామని విన్‌ ఎయిర్‌ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రాలపై ట్రూజెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంకాయలపాటి ఉమేశ్‌, విన్‌ ఎయిర్‌ ఛైర్మన్‌, ఎండీ శామ్యూల్‌ తిమోథి ఏప్రిల్‌ 26న సంతకాలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. తాజా పెట్టుబడులు సమకూర్చడంతో పాటు అనుభవం కలిగిన నిపుణుల ద్వారా ట్రూజెట్‌ను పునరుద్ధరిస్తామని తిమోథి వివరించారు. డిసెంబరు కల్లా ప్రస్తుతం ఉన్న 3 ఏటీఆర్‌లతో సహా మొత్తం 17 విమానాలతో ట్రూజెట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సంస్థ ఎండీ పదవిలో ఉమేశ్‌ కొనసాగుతారని, సరికొత్త వ్యాపార కార్యకలాపాలపై మార్గదర్శకత్వం జరుపుతారని తెలిపారు. తాజా చర్య వల్ల ట్రూజెట్‌లో ఉన్న 650 మంది సిబ్బంది, వారి కుటుంబాలకు పెద్ద ఊరట కలగడమే కాక, ప్రయాణికులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని