జొమాటో సీఈఓ రూ.700 కోట్ల విరాళం

ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ దాదాపు 90 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.700 కోట్ల) విరాళాన్ని ప్రకటించారు. డెలివరీ భాగస్వాముల పిల్లల

Published : 07 May 2022 01:57 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ దాదాపు 90 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.700 కోట్ల) విరాళాన్ని ప్రకటించారు. డెలివరీ భాగస్వాముల పిల్లల చదువులకు సాయపడేందుకు వ్యక్తిగత ఈసాప్స్‌ (ఎంప్లాయి స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌) నుంచి జొమాటో ఫ్యూచర్‌ ఫౌండేషన్‌కు ఈ మొత్తాన్ని అందించనున్నారు. జొమాటో పబ్లిక్‌ ఇష్యూకు రాకముందు గత పనితీరు ఆధారంగా పెట్టుబడిదార్లు, బోర్డు ఆయనకు కొంతమేర ఈసాప్స్‌ మంజూరు చేశాయి. గత నెలలో షేరు సగటు ధర ప్రకారం వీటి విలువ దాదాపు రూ.700 కోట్లని ఉద్యోగులకు గోయల్‌ తెలిపారు. డెలివరీ భాగస్వాముల ఇద్దరు పిల్లల వరకు చదువుకు అయ్యే ఖర్చును జొమాటో ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ భరిస్తుందని, ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.50000 వరకు ఇస్తామని తెలిపారు. ఇందుకోసం జొమాటోలో 5 ఏళ్లకు పైగా పనిచేసిన వారే అర్హులన్నారు. 10 ఏళ్ల పాటు పనిచేసిన భాగస్వాముల పిల్లలకు  ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. మహిళా డెలివరీ భాగస్వాములకు ఈ నియమాలు తక్కువగా ఉంటాయని, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న బాలికలకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని