కొనుగోళ్లతో విస్తరణ

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాగర్‌ సిమెంట్స్‌ సత్వర వృద్ధి అవకాశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇతర సిమెంటు కంపెనీలను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు,

Published : 18 May 2022 02:59 IST

రూ.500 కోట్లతో సాగర్‌ సిమెంట్స్‌ సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాగర్‌ సిమెంట్స్‌ సత్వర వృద్ధి అవకాశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇతర సిమెంటు కంపెనీలను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నాటికి దీన్ని పూర్తి చేయాలనేది కంపెనీ యాజమాన్యం ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం రూ.500 కోట్ల రుణ నిధులను సిద్ధంగా పెట్టుకుంది. అంటే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

సాగర్‌ సిమెంట్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనిట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో 2 కొత్త యూనిట్లు ఇటీవల ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టాయి.  మధ్యప్రదేశ్‌ యూనిట్‌తో 1 మిలియన్‌ టన్నులు, ఒడిశా యూనిట్‌తో 1.5 మిలియన్‌ టన్నుల మేరకు అదనపు ఉత్పత్తి సామర్థ్యం లభించింది. దీంతో సాగర్‌ సిమెంట్స్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 మిలియన్‌ టన్నులకు చేరుతోంది. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సిమెంటు ఉత్పత్తి సామ  ర్థ్యాన్ని సాధించాలనేది సాగర్‌ సిమెంట్స్‌ యాజమాన్య లక్ష్యం. ఇందుకోసమే ఇతర సిమెంటు కంపెనీలను కొనుగోలు చేయడంపై దృష్టి సారించింది.

ఆదాయం పెరిగినా లాభం తగ్గింది:  గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.1,597 కోట్ల నికర ఆదాయాన్ని, రూ.59 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21లో నికర ఆదాయం రూ.1,371 కోట్లు, నికరలాభం రూ.186 కోట్లు ఉన్నాయి. ఆదాయం 16 శాతం పెరిగినా, నికరలాభం తగ్గింది. ముడిపదార్థాల వ్యయాలు, ఇతర ఖర్చులు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. మార్చి 31 నాటికి కంపెనీకి రూ.1,503 కోట్ల స్థూల రుణభారం ఉంది. ఇందులో రూ.500 కోట్లను ఇతర సిమెంటు కంపెనీలను కొనుగోలు చేసే నిమిత్తం సిద్ధంగా పెట్టుకున్నట్లు సాగర్‌ సిమెంట్స్‌ జాయింట్‌ ఎండీ శ్రీకాంత్‌ రెడ్డి, ఇటీవల మదుపరులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ కాల్‌లో వెల్లడించారు. కంపెనీల కోసం అన్వేషణ సాగుతోందన్నారు. ముడిపదార్థాలపై పెరిగిన భారాన్ని ఇప్పటికిప్పుడే వినియోగదార్లకు బదిలీ చేయటం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. తద్వారా కొంతకాలం పాటు ఈ భారాన్ని ఉత్పత్తిదార్లే మోయాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంటుకు అధిక డిమాండ్‌ లభిస్తుందనే ఆశాభావాన్ని సంస్థ వ్యక్తం చేసింది. సాగర్‌ సిమెంట్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 36 లక్షల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసింది. డిమాండుకు తగ్గట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని