Updated : 22 May 2022 02:54 IST

సంక్షిప్తంగా..

సీఎన్‌జీ ధరలు మళ్లీ పెరిగాయ్‌
కిలోపై రూ.2 పెంపు

దిల్లీ: సీఎన్‌జీ ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం కిలోకు రూ.2 మేర పెంచడంతో రూ.73.61కు చేరినట్లు దేశ రాజధానిలో సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్‌ వెబ్‌సైట్‌ వెల్లడిస్తోంది. మార్చి 7 నుంచి చూసుకుంటే మొత్తం 13 సార్లు ధరలు పెంచడంతో, కిలో ధర రూ.19.60 మేర అధికమైంది. ఏడాది కాలంలో రూ.32.21 లేదా 60 శాతం మేర ఈ ధరలు హెచ్చాయి. ఇంటికి గొట్టాల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్‌(పీఎన్‌జీ) ధరలు మాత్రం ప్రామాణిక ఘనపు మీటరు(ఎస్‌సీఎమ్‌)కు రూ.45.86 వద్ద మార్పు లేకుండానే కొనసాగుతున్నాయి.


కాన్‌కర్‌ వాటా విక్రయంపై త్వరలో నిర్ణయం!

దిల్లీ: కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాన్‌కర్‌) పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) వి. కల్యాణ రామ అంచనా వేశారు. ‘కంపెనీలో వాటా విక్రయం జరిపే విషయం ఎపుడో నిర్ణయమైంది. అందులో మార్పు ఉండదని అనుకుంటా. అయితే ఎపుడు జరుగుతుందనే విషయమై  ప్రభుత్వం నుంచి త్వరలోనే సమాచారం రావొచ్చ’ని ఆయన పేర్కొన్నారు. కంటైనర్‌కార్ప్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి 2019 నవంబరులో కేబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపింది. అయితే భారత రైల్వేలతో భూమి లీజింగ్‌ విధానం తుదిరూపునకు రాకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇపుడు రైల్వేలతో దీర్ఘకాల కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి వీలుంది. 35 ఏళ్ల పాటు 24 టెర్మినళ్లను ప్రస్తుత మార్కెట్‌ ధర ఆధారంగా లీజుకు తీసుకోవచ్చు. దీని వల్ల రైల్వే భూముల లీజుపై కంపెనీ చెల్లించే వార్షిక ఫీజు తగ్గుతుంది. 2021-22లో భూమి లైసెన్సు ఫీజుకింద రూ.465 కోట్లను కంపెనీ చెల్లించింది. కొత్త విధానానికి ఒక్కసారి ఆమోదముద్ర పడితే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మొదలవుతుంది. కంపెనీలో ప్రభుత్వానికి 54.8 శాతం వాటా ఉండగా.. 30.8% వాటా విక్రయించాలని భావిస్తోంది.


పోకర్ణ వార్షికాదాయం రూ.652 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌:  పోకర్ణ లిమిటెడ్‌ మార్చి త్రైమాసికానికి రూ.205.23 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, రూ.20.29 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.95.61 కోట్లు, నికరలాభం 3.98 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి రూ.652.72 కోట్ల ఆదాయాన్ని, రూ.79.19 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21లో ఆదాయం రూ.301.09 కోట్లు, నికరలాభం రూ.28.73 కోట్లు మాత్రమే. రూ.2 ముఖ విలువ కల ఒక్కో షేరుకు 60 పైసల చొప్పున డివిడెండ్‌ను ప్రతిపాదించింది.


లాభాల్లోకి భెల్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) మార్చి త్రైమాసికంలో రూ.912.47 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1,036.32 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది. మొత్తం ఆదాయం రూ.7,245.16 కోట్ల నుంచి రూ.8,181.72 కోట్లకు చేరుకుంది. 2021-22కు గాను ఒక్కో షేరుపై 40 పైసల డివిడెండ్‌ అందిస్తున్నట్లు తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని