కొత్త ఉద్యోగాలకు కొదవ లేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఉద్యోగ నియామకాలపై ఆశావాదంతో ఉన్నట్లు భారతీయ కంపెనీలు వెల్లడించాయని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథాన సాగుతుండటంతో కొత్త ఉద్యోగుల్ని....

Published : 22 May 2022 03:01 IST

2022-23పై భారతీయ కంపెనీల ఆశావాదం
జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నివేదిక

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఉద్యోగ నియామకాలపై ఆశావాదంతో ఉన్నట్లు భారతీయ కంపెనీలు వెల్లడించాయని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథాన సాగుతుండటంతో కొత్త ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న కార్పొరేట్లు తెలిపారని వివరించింది. నియామకాలు, వలసల ధోరణిపై జీనియస్‌ కన్సల్టెంట్స్‌ రూపొందించిన నివేదిక ప్రకారం..

* 72 శాతం మంది కార్పొరేట్లు కొత్త నియమాకాలు చేపడతామన్నారు. 18 శాతం మంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్ని మార్చుకుంటామని (రీప్లేస్‌మెంట్‌) వెల్లడించారు.
* తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగుల్ని బలోపేతం చేసుకునేందుకు కంపెనీలు అంతర్గతంగా సమీక్షలు నిర్వహిస్తున్నాయి.
* తమ బృందాన్ని 10-15 శాతం మేర పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు 40 శాతం మంది కార్పొరేట్లు పేర్కొనగా, 10 శాతం మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని 30 శాతం మంది తెలిపారు. 10 శాతం కంటే ఎక్కువ మందిని నియమించుకుంటామని మరో 15 శాతం సంస్థలు వెల్లడించాయి.
* విపణిలో గిరాకీ ఆధారంగా కంపెనీలు బలోపేతం అయ్యేందుకు ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటున్నాయని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ ఛైర్మన్‌, ఎండీ ఆర్‌పీ యాదవ్‌ తెలిపారు. సానుకూల వ్యాపార సెంటిమెంట్‌తో పాటు వినియోగం పెరగడంతో కొత్త ఉద్యోగ విపణికి గిరాకీ పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
* 1,260 మంది ఎగ్జిక్యూటివ్‌ స్థాయి మేనేజర్లు, హెచ్‌ఆర్‌ ప్రతినిధులను గత మార్చి, ఏప్రిల్‌లో సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్లు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ వివరించింది. వాహన, వాహన విడిభాగాలు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, నిర్మాణ, ఇంజినీరింగ్‌, విద్య, ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ, లాజిస్టిక్స్‌, తయారీ, మీడియా, చమురు-గ్యాస్‌, ఔషధ, వైద్య, విద్యుత్‌, ఇంధన, స్థిరాస్తి, రిటైల్‌, టెలికాం రంగాల్లోని సంస్థల్ని సర్వే చేసినట్లు పేర్కొంది.
* 3-7 ఏళ్ల పని అనుభవం ఉన్న వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తామని 51 శాతం సంస్థలు తెలుపగా, 8-13 ఏళ్ల అనుభవజ్ఞులను నియమించుకుంటామని 15 శాతం సంస్థలు వెల్లడించాయి. మహిళలు, పురుషులను సమానంగా నియమించుకుంటామని 46 శాతం సంస్థలు పేర్కొన్నాయి.
* పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, మార్కెటింగ్‌ సిబ్బంది, ఎంబీఏ, ఇంజినీర్లకు అధికంగా ఉద్యోగావకాశాలు ఉన్నట్లు సంస్థలు తెలిపాయి.
* ఈ ఆర్థిక సంవత్సరంలో 7-10 శాతం వేతన పెంపు ఇవ్వనున్నట్లు 33 శాతం సంస్థలు, 5-7 శాతం పెంపు ఇస్తామని 22 శాతం కంపెనీలు వెల్లడించాయి. 5 శాతం కంటే తక్కువ వేతన పెంపునకు 33.5 శాతం సంస్థలు మొగ్గు చూపగా, పెంపు ఇవ్వలేమని 11 శాతం కంపెనీలు ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని