సంక్షిప్త సమాచారం

 భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికారిక సంస్థ (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాలను అనుసరించి రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే అర్హత పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఉండకపోవచ్చని సంబంధిత

Updated : 27 May 2022 06:52 IST

టొరెంట్‌ ఫార్మా చేతికి  డాక్టర్‌ రెడ్డీస్‌ 4 బ్రాండ్‌లు

దిల్లీ: డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి నాలుగు ఔషధ బ్రాండ్‌లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ వెల్లడించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ బ్రాండ్‌లు సిప్టోవిట్‌-ఇ, ఫినాస్ట్‌, ఫినాస్ట్‌-టీ, డైనాప్రెస్‌లను టొరెంట్‌ కొనుగోలు చేయనుంది. ఈ లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థ ప్రకటించలేదు. గైనకాలజీ ఉత్పత్తి అయిన సిప్టోవిట్‌-ఇ కి దాదాపు రూ.500 కోట్ల మార్కెట్‌ పరిమాణం ఉందని, ఈ విభాగంలో కంపెనీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని టొరెంట్‌ తెలిపింది. యురాలజీ విభాగంలో బలోపేతానికి ఫినాస్ట్‌, ఫినాస్ట్‌-టీ, డైనాప్రెస్‌ ఔషధాలు ఉపకరిస్తాయని వెల్లడించింది. భారత్‌లో ఈ బ్రాండ్‌ల తయారీ, మార్కెటింగ్‌, పంపిణీ హక్కులు టొరెంట్‌ ఫార్మా చేతికి వెళ్లనున్నాయి. బ్రాండ్‌ హక్కుల మార్పిడి జూన్‌కు పూర్తయ్యే అవకాశం ఉంది.


రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ కొనుగోలు అర్హత పిరమాల్‌కు లేదు!

ఐఆర్‌డీఏఐ ఆంక్షల వల్లే

దిల్లీ: భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికారిక సంస్థ (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాలను అనుసరించి రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే అర్హత పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. రిలయన్స్‌ కేపిటల్‌, దాని అనుబంధ సంస్థల కోసం దివాలా పరిష్కార దరఖాస్తులు సమర్పించిన 54 సంస్థల్లో పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఒకటి. ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒక విభాగంలో ఒకటికి మించి బీమా సంస్థల్లో ప్రమోటర్లు వాటా కలిగి ఉండకూడదు. ఒక బీమా కంపెనీలో సొంతంగా 10 శాతానికి మించి, సంయుక్తంగా 25 శాతానికి మించి వాటా కలిగి ఉండకూడదు. ఈ నిబంధనలు అనుసరించి రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు విషయంలో పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు అర్హత ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటరుగా ఉంది. దీంతోపాటు శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు హోల్డింగ్‌ కంపెనీ అయిన శ్రీరామ్‌ కేపిటల్‌లో పరోక్షంగా 20 శాతం వాటా కలిగి ఉండటమే ఇందుకు కారణం.

రిలయన్స్‌ కేపిటల్స్‌లో బీమా కాకుండా ఇతరత్రా వ్యాపారాల కొనుగోలుకు పిరమాల్‌ దరఖాస్తు చేసుకోవచ్చని అంటున్నాయి. రిలయన్స్‌ కేపిటల్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో బిడ్డర్‌లు ఎంచుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. పూర్తిగా రిలయన్స్‌ కేపిటల్‌కు బిడ్‌ చేయొచ్చు. లేదంటే రిలయన్స్‌ కేపిటల్‌కు చెందిన ఒకటి లేదా అంతకుమించి అనుబంధ సంస్థల కోసం బిడ్‌ వేయొచ్చు. రిలయన్స్‌ కేపిటల్‌ అనుబంధ సంస్థల్లో రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ సెక్యూరిటీస్‌, రిలయన్స్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. రుణాల ఎగవేత, పాలనాపరమైన లోపాల కారణంగా రిలయన్స్‌ కేపిటల్‌ బోర్డును గతేడాది నవంబరు 29న ఆర్‌బీఐ రద్దు చేసి, దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించింది.


భారత్‌లో లాజిస్టిక్స్‌ బ్రాండ్‌కు ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, యూపీఎస్‌ జట్టు

దిల్లీ: భారత్‌లో వాహన, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ సహా పలు విభాగాల్లో బీ2బీ లాజిస్టిక్స్‌ సేవలు అందించేందుకు సంయుక్త సంస్థను ప్రారంభిస్తున్నట్లు రాహుల్‌ భాటియా నేతృత్వంలోని ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికా సంస్థ యూపీఎస్‌ ప్రకటించాయి. సంయుక్త సంస్థ ‘మోవిన్‌’ గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేయనుంది. మోవిన్‌ బోర్డులో యూపీఎస్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌లకు ప్రాతినిథ్యం ఉంటుంది. దేశీయ బీ2బీ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని, ఇందులో వృద్ధి కొనసాగుతుందని ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ జేబీ సింగ్‌ తెలిపారు. సంయుక్త సంస్థకు విడిగా బోర్డు, మేనేజ్‌మెంట్‌ బృందం ఉంటాయన్నారు. ఇప్పటికే దిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించినట్లు వివరించారు. సంయుక్త సంస్థలో పెట్టుబడుల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.


సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ డివిడెండ్‌ 100%

ఈనాడు, హైదరాబాద్‌: జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.52.70 కోట్ల నికర లాభాన్ని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.49.20 కోట్లతో పోలిస్తే ఈసారి పెరిగింది. మొత్తం ఆదాయం  రూ.334.55 కోట్ల నుంచి రూ.379.47 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2021-22) నికర లాభం రూ.204.35 కోట్లుగాను, ఆదాయం రూ.1,466.12 కోట్లుగాను నమోదయ్యాయి. 2020-21లో ఇవి వరుసగా రూ.182.26 కోట్లు,   రూ.1245.87 కోట్లుగా ఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.2 (100%) తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది.


సహారా గ్రూప్‌ కంపెనీలకు చుక్కెదురు

దిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలపై తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయ (ఎస్‌ఎఫ్‌ఐఓ) దర్యాప్తు, ఇతర చర్యలపై స్టే విధిస్తూ దిల్లీ హైకోర్టు జారీచేసిన ఆదేశాలను సుప్రీం కోర్టు గురువారం పక్కన పెట్టింది. గ్రూప్‌ అధిపతి సుబ్రతా రాయ్‌పై లుక్‌ అవుట్‌ సర్క్యులర్లు కూడా అందులో ఉన్నాయి. ఒక దర్యాప్తుపై స్టే ఇవ్వడం ‘చాలా అసాధారణ ఆదేశమ’ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ బేలా ఎమ్‌ త్రివేదిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. అదే సమయంలో హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐఓ దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. ‘దర్యాప్తుపై స్టే ఇవ్వడం సహేతుకం కాదని మేం భావిస్తున్నామ’ని, హైకోర్టు ఆదేశాలను పక్కకు పెడుతూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.


కీలక ప్రాంతాల్లో భూములకు అధిక గిరాకీ

అనరాక్‌ నివేదిక

దిల్లీ: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్థిరాస్తి విపణిలో 28 భారీ భూ ఒప్పందాలు జరిగాయని ప్రోపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ వెల్లడించింది. ఈ లావాదేవీల్లో దేశ వ్యాప్తంగా 1,237 ఎకరాలకు పైగా కొనుగోళ్లు జరిగినట్లు పేర్కొంది. 2021 తొలి అర్ధ భాగంలో ఇలాంటివి 14 ఒప్పందాలే జరిగాయని, అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. 18 ఒప్పందాల ద్వారా సేకరించిన 351 ఎకరాల్లో బహుళ నివాస ప్రాజెక్టులను ఆయా సంస్థలు చేపట్టాయని తెలిపింది. 3 ఒప్పందాల్లో 115 ఎకరాలను డేటా కేంద్రాల కోసం, 2 ఒప్పందాల్లో 63 ఎకరాల్ని లాజిస్టిక్స్‌ గిడ్డంగుల ప్రాజెక్టుల కోసం, 4 ఒప్పందాల్లో 108 ఎకరాలను మిశ్రమ వినియోగ అభివృద్ధికి ఆయా సంస్థలు వినియోగిస్తున్నాయని వివరించింది. హైదరాబాద్‌ స్థిరాస్తి విపణి చాలా క్రియాశీలకంగా ఉందని, ఇక్కడ 5 ఒప్పందాల ద్వారా 715 ఎకరాల కొనుగోళ్లు జరిగాయని అనరాక్‌ తెలిపింది. ఇక్కడ ఒక ఒప్పందంలోనే 600 ఎకరాల స్థలం కొనుగోలు జరిగిందని వెల్లడించింది. బెంగళూరులో 140 ఎకరాలు, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 106 ఎకరాలు, గురుగ్రామ్‌లో 91 ఎకరాలు, పుణెలో 91 ఎకరాలు, ఎంఎంఆర్‌లో 55 ఎకరాలు, చెన్నైలో 6 ఎకరాల కొనుగోళ్లు జరిగాయని వెల్లడించింది.  

భూమి కొనుగోలు చేసిన ప్రధాన డెవలపర్లు: గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌, ఒబెరాయ్‌ రియాల్టీ, మహీంద్రా లైఫ్‌ సైన్సెస్‌, గౌర్స్‌ గ్రూప్‌, బిర్లా ఎస్టేట్స్‌, హెటెరో గ్రూప్‌, మైక్రోసాఫ్ట్‌, మాపుల్‌ట్రీ లాజిస్టిక్స్‌.


భారతీ ఎయిర్‌టెల్‌లో 2-4% వాటా విక్రయించనున్న సింగ్‌టెల్‌

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో 2-4 శాతం వాటాను విక్రయించేందుకు ఆ సంస్థ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌తో సింగపూర్‌ టెలికాం కంపెనీ సింగ్‌టెల్‌ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతమున్న మార్కెట్‌ విలువ ప్రకారం.. 2 శాతం వాటా విక్రయం ద్వారా సింగ్‌టెల్‌కు సుమారు రూ.7,500 కోట్లు సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌కు 31.7 శాతం వాటా ఉంది. మిత్తల్‌ కుటుంబానికే చెందిన భారతీ టెలికాంలోనూ సింగ్‌టెల్‌ 49.44 శాతం వాటా  కలిగి ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌లో 35.85 శాతం వాటా భారతీ టెలికాంకు ఉంది.  


బీసీసీఎల్‌లో 25% వాటా విక్రయించనున్న కోల్‌ ఇండియా

దిల్లీ: కోల్‌ ఇండియా తన అనుబంధ సంస్థ భారత్‌ కుకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌)లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. ఇతరత్రా అనుమతులు లభించాక.. ఈ అనుబంధ సంస్థను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనుంది. బొగ్గు మంత్రిత్వ శాఖ సూచన మేరకు 2022, మార్చి 10న  తమ 438వ బోర్డు సమావేశంలో పై ప్రతిపాదనలకు సూత్రప్రాయ అనుమతులు లభించాయని ఎక్స్ఛేంజీలకు కోల్‌ ఇండియా తెలియజేసింది. మరిన్ని అనుమతుల కోసం బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ పంపాలని బోర్డు సూచించిందని పేర్కొంది. ప్రస్తుతానికి సూత్రప్రాయ అనుమతులే లభించాయని, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక తదుపరి కార్యాచరణ చేపడతామని పేర్కొంది. బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభిస్తే.. ఆ తర్వాత కోల్‌ ఇండియా బోర్డుకు పంపిస్తామని, బోర్డు నిర్ణయాన్ని ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని వివరించింది.


ఎన్‌ఎమ్‌డీసీ లాభంలో 36% క్షీణత

దిల్లీ: జనవరి- మార్చిలో ఎన్‌ఎమ్‌డీసీ నికర లాభం రూ.1,812.98 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.2,835.40 కోట్లతో పోలిస్తే ఈసారి 36 శాతం తగ్గింది. ఇదే సమయంలో  మొత్తం ఆదాయం రూ.6,932.75 కోట్ల నుంచి రూ.7,034.83 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.2,668.36 కోట్ల నుంచి రూ.4,156.62 కోట్లకు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని